Sunday, January 9, 2011

..సెలవిక!

జీవితమంటే.. 
..అనురక్తే కానీ, అంతలోనే విరక్తి... 

చేసినవే చేయడం...
చూసినవే చూడడం...
తిన్నవే తినడం...
విన్నవే వినడం...
అన్నవే అనడం... 
...ఏ క్రమంలోనూ క్రమంతప్పని కర్మల క్రమాలు... 

నేర్చుకున్న పాఠాలే మళ్లీ మళ్లీ నేర్వడం 
చేసినతప్పులే మళ్లీ మళ్లీ చేయడం 
పొందిన శిక్షలే మళ్లీ మళ్లీ పొందడం.. 
అనుభవాలు.. వాటి చుట్టూ అవే తిరగడం!

నవ్విన నవ్వూ 
ఏడ్చిన ఏడుపూ 
అదే ఆవేశం, అదే ఆగడం.. 
కనీసం నాకు నేనైనా కొత్తగా లేను 
సంవత్సరాల తరబడి ఇదే పాత ముఖం!? 
చచ్చిపోయి మళ్లీ పుట్టుంటే కొత్త ముఖం వచ్చి, కొంచెం బాగుండేది!

పారిపోవాలనిపిస్తోంది... 
నిన్నటి కర్తవ్యాలు 
మొన్నటి బాధ్యతలు.. 
ఆ మొన్నటి కథలూ 
రేపటి పథకాలు.. 
కడపటి వాగ్ధానాలు 
మునుపటి వాగ్భాణాలు.. 
కదనుతొక్కే యుద్ధ రంగాలు 
అలుముకునే అంతరంగాలు..  
అసంపూర్ణమైన పనులు వెంటపడి వేధించని చోటుకి..,
పారిపోవాలనిపిస్తోంది! 

ఎన్నో ప్రయత్నాలు... 
ఎన్ని ప్రయత్నాలు!?... 
చేశాను, కానీ..  
ప్రపంచపటం నుండి తప్పించుకుని, పారిపోవడం.. 
కుదరనిదని అర్థమయిపోయింది, అందుకే ఇక.. 

...కొన్ని రోజులు వలసపోతున్నా... 

నా లోపల
లోలోపల ఉన్న 
పాతాళ లోకాలకు.. 
..అజ్ఞాత ప్రయాణం చేయడానికి వెళుతున్నా..! 

ఒక రోజు 
పది రోజులూ 
పది వారాలూ 
పది నెలలూ 
పది సంవత్సరాలూ 
పది జీవితాలూ
పది పది పదుల జన్మలూ.. 
..మళ్లీ, మళ్లీ రావటం తప్పదనీ తెలిసీ, 
మళ్లీ మళ్లీ వెళ్లటమూ తప్పదని వెళుతున్నాను.. 

విధ, విధాల.. వివిధ వలయాల విధిని వదిలించుకునే జ్ఞాన నిధికి.. వలస దారిని వెదుకుతూ.. సెలవిక!


No comments:

Post a Comment