Wednesday, September 10, 2014

మనసు తనువై తపిస్తే...

మనసు తనువై తపిస్తే... 
ఆ తాపం చల్లార్చుకోవడానికి.. జలపాతం తుంపర్లు వెదజల్లుతున్న చోట.. నేనో చిన్న మొక్కను కావాలి..
నీటి బిందువుల అరిపాదాలు.. గల, గల సిరిమువ్వలను కట్టుకుని లేతపచ్చనాకుల్లాంటి నా దోసిల్లలో వాలాలి.
ఆ సవ్వడి బరువుకు నా తీగల నడుము గాలిలో నాట్యం చేయాలి .
ఆకాశం ఆ క్షణానికాక్షణం నేలకు వంగి, మేఘాల చేతులు చాచి ఆలింగనం చేసుకోవాలి 

చందమామ వెన్నెల పూలచెండుతో సయ్యాటలాడాలి 
ఉన్నట్లుండి మబ్బుల కుండలు వానలు కుమ్మరించాలి 
నింగీ, నేలల మధ్య వాన ధారల తెర కట్టాలి 
ఆ తెరల మాటునుంచీ చీల్చుకుంటూ సూర్య కిరణాలు నా మోమును ముద్దాడాలి 
సరిగ్గా అప్పుడే.. అర విరిసిన ఇంద్ర ధనుస్సు నా సౌందర్యంతో పోటీ పడాలి 
పువ్వుల శ్వాస సంగీతాలు ఆలపించాలి 
గాలి తుమ్మెద ఝూంకారాలు చేస్తూ.. నా అధరాల సుధలను గ్రోలాలో, లేక ఆ సుమ కుసుమాల మధువును తాగాలో తెలియక తికమకపడాలి 
నల్లని నా కురుల చారలు కొలనులా కొలువుతీరాలి 
అందులో రాజ హంసలు జలకాలాడాలి 
నా శృంగార ప్రతిమ అక్కడ ఉండగా ఒక్క ప్రియుడైనా తమను తొంగి చూడట్లేదని అలలు తమలో తాము కలవరపడి నా కాళ్లకు అల్లుకుపోవాలి 
ఆ తటిల్లతల తల పొగరు తగ్గించామన్న గర్వంతో నా స్తనాలు శిఖరాలవ్వాలి 
ఆ పరువం వెలుగుకు వెలుతురు పొగచూరి పోవాలి 
అరచీకట్లలోని మత్తు నా మనసును మరలుగొల్పాలి 
సరిగ్గా అప్పుడు..  ఆ అరవెలుతురులో, వాలిపోయిన ఆ నెలవంక మాటు నుంచీ ఏ దివ్య లోకాల నుంచో ఓ చెలికాడు నన్ను తొంగి చూడాలి... 
ఇక ఈ విరహాన్ని చాలించి.. నేనీ స్వర్గ సరోవరంతో పాటు అతనున్నవైపుకు ఎగిరిపోవాలి!...