Friday, May 12, 2017

ధర్మో రక్షితి రక్షితః!

 
ధర్మో రక్షితి రక్షితః!
ధర్మాన్ని రక్షిస్తే.. అంటే, ధర్మాన్ని ఆచరిస్తే.. మనం ఆచరించిన ధర్మం మనల్ని కాపాడుతుందని అర్థం!

ధర్మమంటే?...
...ఇతరులు ఏదిచేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇబ్బందికలుగుతుందో దాన్ని ఇతరులకు నీవు చేయకుండా ఉండడమే ధర్మం!
అంటే ఏం చేయాలి? ఎలా చేయాలి??
..ఏం చేసినా దాన్ని ధర్మంగా  చేయాలి. 

ధర్మంగా ఆలోచించాలి..
ధర్మంగా ప్రవర్తించాలి..
ధర్మంగా నిత్యాచరణలు ఆచరించాలి..
ధర్మంగా డబ్బు సంపాదించాలి..
ధర్మంగా ఆహారం సంపాదించాలి..
ధర్మంగా ప్రేమించాలి..
ధర్మంగా కామించాలి..
ధర్మంగా శ్రమించాలి..
ధర్మంగా దానం చేయాలి..
ధర్మంగా బాధ్యతలు నిర్వర్తించాలి..
ధర్మంగా న్యాయం చేయాలి..
ధర్మంగా ప్రకృతి పరిరక్షణ చేయాలి..
ఇంకా.., ఏమి చేసినా.. ఏమేమి చేసినా. ప్రతీదీ, అన్నీ.. ధర్మంగా చేయాలి.
ధర్మమే సూత్రము!
ధర్మమే శాస్త్రము!!
ధర్మమే విశ్వ విజయము!!!

...ధర్మంగా ఇవన్నీ చేయలేమా? అసంభవమా.. అంత కష్టమా.. నమ్మకం లేదా?
నమ్మకం లేదా ధర్మం మీద, నమ్మకం లేదా విశ్వ స్వభావం మీదా..
ధర్మం కోసం నువ్వు నిలబడితే..
..అనంత విశ్వమే నీ కోసం నిలబడి కలబడుతుంది!

ఇక..
ఇది కలికాలం
మోసాల కాలం
కులాసాల కాలం
ధర్మాన్ని అమ్ముకుంటే బ్రతగ్గలం గానీ.. ధర్మాన్ని నమ్ముమకుంటే ఇక బ్రతికినట్లే.. అని అనిపిస్తోందా..
అది కేవలం అనిపించడమే కానీ
అది ఎన్నటికీ నిజం కాదు.
అధర్మం అందలమెక్కించినట్లు అనిపిస్తుంది
అధర్మం అన్నీ సమకూర్చినట్లు కనిపిస్తుంది
కానీ.. అధర్మం
టైమ్ చూసి దెబ్బతీస్తుంది
గురి చూసి ఓడిస్తుంది
గిరిగీసి శిక్షిస్తుంది
ఒడ్డున పడ్డాక లాగి ముంచేస్తుంది, చేసి తీరుతుంది, ఎందుకంటే..

...
సృష్టి యాగంలో..
కాలం యుగాల్లో..
ఏ యుగానికైనా ధర్మమే యుగధర్మం!
ధర్మమే విశ్వ స్వభావం!!

మరి
ఈ అధర్మ కాలంలో
ఈ మోసపు ప్రపంచంలో
ఈ అవినీతి రాజ్యాల్లో
ఈ అక్రమార్కుల సమాజాల్లో
ఏలా?
ఎలా??
ఎలా???
ఎలా ధర్మాన్ని స్వీకరించాలి
ఎలా ధర్మాన్ని ఆచరించాలి
ఎలా ధర్మంగా జీవిత పోరాటం చేయాలి...
...ఎలాంటి సంకోచమూ లేకుండా...
ధర్మమే జీవితంగా పోరాటం చేయండి..
ధర్మమే వెన్నంటి నిన్ను నిర్భయున్ని చేస్తుంది
విశ్వమే వెన్నంటి నిన్ను అభయున్ని చేస్తుంది
అంతెందుకు
ఆ విశ్వ శక్తే వెన్నంటి నిన్ను నడిపిస్తుంది
ఆ విశ్వాధీశుడే వెన్నంటి నిన్ను కాపాడుకుంటాడు!..
..కాదు, కాదు.
ఆ విశ్వ నాథుడే నీ ముందుడి.., వెనకుండి కాదు, ముందుండి నీ  "రథ సారథి" అయి నీతో ఈ జీవన పోరాటాన్ని చేయుస్తాడు.
నీ  "రథ సారథి" అయి నీ యుద్ధాన్ని తానే గెలిసిస్తాడు.
మరచిపోకు మిత్రమా.. యుగ, యుగాలుగా..ప్రతి యుగంలో ధర్మన్ని గెలిపించిన చరిత్ర విశ్వానిది, ధర్మాన్ని మాత్రమే గెలిపించిన చరిత్ర!

ధర్మో రక్షితి రక్షితః!


Saturday, February 18, 2017

...నా స్వప్నాన్ని నాకివ్వండి...


ఒక్కో సారి కళ్లు మూసి ఉండటం లోనే సుఖం ఉంటుంది 
బలవంతంగా కళ్లు తెరిపిస్తే.. 
మూసిన రెప్పల వెనుక ఉన్న రహస్య స్వప్నం ఎగిరి పోతుంది,  
రెక్కలు విరిగిన పక్షి మిగిలిపోతుంది! 

...నాకూ నా స్వప్నానికి మధ్య, 

ఈ మెళకువ.. 
విరిగిన వంతెనలా పనిచేస్తోందీ. 
నా కలని హరికట్టే హక్కు కాలానికి ఎందుకు? 
ఎక్కడో ఓ చోట నాదైన బ్రతుకు నన్ను బ్రతకనివ్వదేం?? 
రెప్ప మూసిన చోటైనా - రెప్ప తెరచిన చోటైనా... 
రెప్ప పాటు కాలానికి తేడా గానీ నాకేం తేడా లేదు!!

సుఖమైనా, సముఖమైన జీవితం లేని వేదిక మీద.. 

కమ్మని కలలో బ్రతికే హక్కు కోసం..  
ఏ శాసన ధిక్కారాలకైనా నేను సిద్దమే!!!

...కన్నీళ్లయినా రాకుండా తడారిపోయిన కళ్లకు.. కలలే శాంతి!!!!

వడీ, సవ్వడీ లేని నిజంలో జీవించడం కన్నా, 
కలల ఒడిలో శాశ్వతంగా మరణించినా మేలు!!!!! 
మెళకువ ఇంత దుర్భరంగా ఉంటుందని.. 
చూసిన 15, 2,15 వేకువల్లో.. ఏ వేకువనా నాకు..  
ఇంత వరకూ తెలియనే లేదు, 
బహుశా మెళకువలోనూ స్వప్నాలను జీవించానేమో నేను!!!!!! 

.......ఈ జీవితాన్నిచ్చింది ఎవరైనా సరే, 

మీరిచ్చిన జీవితాన్ని మీరు తీసుకోండి, 
నా స్వప్నాన్ని నాకివ్వండి!!!!!!!....... 


Sunday, December 18, 2016

విశ్వానంతం - మానవజాతి

పేదరికం.. 
సిగ్గుపడాల్సిన విషయం కాదు 
పేదరికం "పేదవాడు" సిగ్గుపడాల్సిన విషయం కాదు, 
ఇది.. దాచుకోవడం నేర్చుకున్న "మానవజాతి" సిగ్గుపడాల్సిన విషయం! 

ఆకలి.. 
బాధపడాల్సిన విషయం కాదు
ఆకలి "ఆకలిగొన్నవాడు" బాధపడాల్సిన విషయం కాదు,
ఇది.. దోచుకోవడం నేర్చుకున్న "మానవజాతి" బాధపడాల్సిన విషయం! 

ఓటమి.. 
తలదించుకోవలసిన విషయం కాదు 
ఓటమి "ఓడినవాడు" తలదించుకోవలసిన విషయం కాదు, 
ఇది.. ఓడించడం నేర్చుకున్న "మానవజాతి" తలదించుకోవలసిన విషయం! 

ఆపద.. 
అసహాయంగా రోదించవలసిన విషయం కాదు, 
ఆపద "అసహాయుడు" రోదించవలసిన విషయం కాదు, 
ఇది.. సాటిమనిషికి సాయమందించుకోలేని "మానవజాతి" రోదించవలసిన విషయం!  

రోగం.. 
కృంగిపోవలసిన విషయం కాదు 
రోగం "రోగి" కృంగిపోవలసిన విషయం కాదు,
ఇది.. పరస్పరం సహానుభూతి చెందలేని, సేవ చేసుకోలేని "మానవజాతి" కృంగిపోవలసిన విషయం!

ఒంటరితనం.. 
కలవరపడాల్సిన విషయం కాదు 
ఒంటరితనం "ఒంటరివాడు" కలవరపడాల్సిన విషయం కాదు, 
ఇది.. కాలం కర్షణలో ఒకరికొకరు తోడు ఉండలేని కరడుగట్టిన, స్వార్థ, కఠిన హృదయం పొందిన "మానవజాతి" కలవరపడాల్సిన విషయం! 

అణచివేత.. 
భయపడాల్సిన విషయం కాదు 
అణచివేత  "అణగారినవాడు" భయపడాల్సిన విషయం కాదు, 
ఇది.. సంకెళ్లు సృష్టించి, అధోగతి సహవాసాలు చేస్తోన్న నిర్దాక్షిణ్య "మానవజాతి" భయపడాల్సిన విషయం! 

హింస.. 
వికలం చెందాల్సిన విషయం కాదు 
హింస "హింసించబడే వాడు" వికలం చెందాల్సిన విషయం కాదు, 
ఇది.. అహింసను అలవరచుకోలేని "మానవజాతి" కకావికలం చెందవలసిన విషయం! 

అగౌరవం 
అవమానం 
మోసం 
ద్వేషం 
నింద 
ద్రోహం 
దోపిడీ 
స్వార్థం 
పరనాశనం 
అన్యాయం 
అక్రమం 
అభిజాత్యం 
జాత్యహంకారం 
లింగ వివక్ష 
చర్మ వివక్ష 
ధన వివక్ష 
జ్ఞాన వివక్ష  
సరిహద్దు కక్ష 
అధికార కాంక్ష 
అసహనం 
అపరిశుద్ధం... 

...అణువణువూ క్షుద్రమవుతోన్న, హృదయదౌర్భల్యమవుతోన్న, మానవత్వ విహీనమవుతోన్న, విశ్వం హృదయానికి ఆరని గాయమవుతోన్న ఈ "మానవజాతి"మనుగడ.. భూమి గడపన, ఆ మట్టి కడుపున ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో... 

విశ్వానంతంలో "శిక్షణ"కు అర్హత కోల్పోయిన ప్రతి గ్రహాంతర జాతీ "శిక్ష"కు తలవంచిన చరిత్ర విశ్వ చైతన్యానిది! 

Saturday, November 8, 2014

"ఎక్కువ జీవిస్తాను!"...

నేను.. ఎక్కువ పని చేస్తాను,
దాంతో చేసే పనుల్లో perfection/సంపూర్ణ సఫలత కోసం ఎక్కువగా ఆలోచిస్తాను,
దాంతో ఆ ఆలోచనల హద్దులకు సరి హద్దులు లేక ఎక్కువ భావోద్వేగాలకు గురి అవుతాను,
దాంతో ఏర్పడే ఆ ఉద్వేగం తాలూకు ఉద్దేశాలతో ఎక్కువ మాట్లాడతాను,
దాంతో ఆ మాటల ప్రభావం సంపూర్ణంగా ఫలించాలంటే వాటిని అక్షరబద్దం చేయాలని రాయడం మొదలెడతాను,
దాంతో రాసేటప్పుడు మరిన్ని మాటలు పుడుతాయి,
దాంతో ఆ మాటలు ఉద్దేశాలుగా మారతాయి,
దాంతో ఆ ఉద్దేశాలు ఊరికే ఉండక ఉద్వేగానికి దారి తీస్తాయి,
దాంతో ఆ ఉద్వేగాల ఉద్వేగంతో నేను ఉధృతంగా ఆలోచిస్తాను,
దాంతో ఆ ఉధృత ఉద్దేశాలను నిలబెట్టుకోవాలని perfectionగా/perfection కోసం పనులు చేస్తాను,
దాంతో ఆ పనులు ఎప్పుడూ పక్క మనిషి నుండీ ప్రపంచం దాకా ముడి పడి అసంపూర్ణంగా అస్తవ్యస్తంగా అవుతూనే ఉంటాయి,
దాంతో నాకు పనులు ఎక్కువ అవుతూనే ఉంటాయి,
దాంతో అదే క్రమంలో ఆలోచనలూ, కోతలూ రాతలూ అన్నీ ఎక్కువవుతూనే ఉంటాయి,
దాంతో నా పనులు చేసుకోడానికి నాకు నేను సరిపోను,
దాంతో నా పనులకు నేను, నేను నా పనులకు సరిపోవడానికి నాకు ఇంకో జత చేతులూ, హృదయాలు, మెదడ్లూ కావాలి,
దాంతో నాకు అన్నీ ఎక్కువగా సరిపోయి నేను ఎక్కువగా రాస్తాను,
దాంతో రాయడానికి ఎక్కువ ఆలోచిస్తూ... ఎక్కువ పనులు చేస్తూ... ఎక్కువ మందితో ముడిపడి...
... ముడిపడి, "ఎక్కువ జీవిస్తాను!"  

రాసేటప్పుడు నేను... "ఎక్కువ జీవిస్తాను!"... రాసేటప్పుడు మాత్రమే.  Saturday, October 25, 2014

వృద్ధ సమృద్ధం

"మార్పు" మనిషికి వరం!
మార్పు మనిషికి అవసరం!!
మార్పు మనిషికి.. అనివార్యం!!!
మార్పు మనిషి నుండి అవిభాజ్యం!!!!

... పరిణామం భూమి తనకు తాను ఇచ్చుకున్న కానుక!
పరిణామం 'నిర్జీవం' తనకు తాను పోసుకున్న "జీవం"!
పరిణామం.. జీవ కణం తనకు తాను చేసుకునే వైద్యం!

ఇంత ప్రపంచమూ, ఇంత ప్రకృతీ మార్పు వల్ల, మారుతూ.. ఉండడం వల్ల ఏర్పడినదే.
రాళ్లూ, రప్పలు చెట్టూ చేమల్లాగా..
చెట్టూ చేమలు పురుగూ, పుట్రల లాగా..
పురుగూ పుట్రలు జంతువుల్లాగా,
జంతువులు మనుష్యుల్లాగా... మనిషి దివ్యుని లాగా..!

భావం భాష లాగా,
భాష అక్షరం లాగా,
అక్షరం ఆలోచనలాగా,
ఆలోచన ఆవిష్కరణలాగా..!...

...ఇప్పుడు, ఇప్పుడిక ఈ క్షణం..
ఇప్పుడుకు చేరుకున్న ఈ ప్రపంచానికి ఇక..
మార్పు లేదా, అవసరం లేదా?
ఉంది!
ఇప్పుడున్న ప్రపంచానికైనా,
ఎప్పుడో ఉన్న ప్రపంచానికైనా,
ప్రపంచం లేని 'అప్పుడు'కైనా..  మార్పే అతి ముఖ్యమైనది!
ఇక ఇప్పుడే, ఇప్పుడున్న ఈ ప్రపంచానికే మార్పు అత్యంత అవసరమై ఉన్నది.
అనంత విశ్వాంతరంగాన్ని సాధించే స్థూల మార్పే కాదు,
నేటి మహిమాన్విత జీవిగా మార్పు చెందిన మనిషి బుద్ధి/మెదడుల్లో సూక్ష్మ స్థాయి లేదా అంతర్గత మార్పు కూడా అనివార్యము.
మనిషి తనలో తను ఉన్నతునిగా మారవలసిన సమయం యుద్ధ ప్రాతిపదికన ఆసన్నమైనది.

జీవ ఔన్నత్యము,
జీవన ఔన్నత్యము,
జీవావరణ ఔన్నత్యము..
అన్నీ మనిషి మారడం పైనే ఆధారపడి ఉన్నాయి.

ఆరోగ్యవంతమైన మనిషి,
ఆనందమైన మనిషి,
మానవత్వం కలిగిన మనిషి,
ప్రేమాస్పదుడైన మనిషి,
ప్రకృతిని పరిరక్షించే మనిషి,
ప్రపంచానికి మంచి చేసే మనిషి,
తన విజ్ఞాన, జ్ఞాన, సమ కాలీన ఉన్నతత్వంతో విశ్వంలో ఉనికిని చాటి చెప్పే మనిషి...
... ఇప్పుడున్న "ఈ మనిషి" మారితే.. తను పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు!
ప్రతి మనిషిలో ప్రతి రోజూ, ప్రతి క్షణమూ తను పుట్టడం కోసం పరితపిస్తున్నాడు!!..

ప్రతి రోజునీ,
ప్రతి క్షణాన్నీ,
ప్రతి విషయాన్నీ,
ప్రతి దానిలోని మార్పునీ..
కొత్తగా స్వీకరించే మనిషి కోసం,
కొత్తగా మారే ఆ ఉన్నత మనసు కోసం..
"కొత్త ప్రపంచం" ఎదురు చూస్తోంది!

మార్పు!..
..ప్రతి మనిషీ తనకు తాను తప్పక చేసుకుని తీరవలసిన వైద్యం..
అంత కన్నా ఇది.. వ్యాధి నివారణం!
తమకు తాము ఈ "టీకా/వ్యాక్సిన్" వేసుకున్న ఎంతో మంది
ఉన్నత,
ఉత్తమ,
గొప్ప,
సంపూర్ణమైన మనుష్యులు..
మనకు ఉదాహరణగా కనిపిస్తూనే ఉన్నారు.
ఇక మనం 'లిస్టు "మారడం', మారడమే" మిగిలి ఉన్నది.
.. ఈ ఒక్క అడుగు.. తో ఈ వృత్తం సంపూర్ణమవుతుంది! 

అప్పుడే పుట్టిన మనలోని పసి పాప మన వృద్ధత్వాన్ని సమృద్ధం చేయడం మనకూ ఇష్టమేగా...  Wednesday, September 10, 2014

మనసు తనువై తపిస్తే...

మనసు తనువై తపిస్తే... 
ఆ తాపం చల్లార్చుకోవడానికి.. జలపాతం తుంపర్లు వెదజల్లుతున్న చోట.. నేనో చిన్న మొక్కను కావాలి..
నీటి బిందువుల అరిపాదాలు.. గల, గల సిరిమువ్వలను కట్టుకుని లేతపచ్చనాకుల్లాంటి నా దోసిల్లలో వాలాలి.
ఆ సవ్వడి బరువుకు నా తీగల నడుము గాలిలో నాట్యం చేయాలి .
ఆకాశం ఆ క్షణానికాక్షణం నేలకు వంగి, మేఘాల చేతులు చాచి ఆలింగనం చేసుకోవాలి 

చందమామ వెన్నెల పూలచెండుతో సయ్యాటలాడాలి 
ఉన్నట్లుండి మబ్బుల కుండలు వానలు కుమ్మరించాలి 
నింగీ, నేలల మధ్య వాన ధారల తెర కట్టాలి 
ఆ తెరల మాటునుంచీ చీల్చుకుంటూ సూర్య కిరణాలు నా మోమును ముద్దాడాలి 
సరిగ్గా అప్పుడే.. అర విరిసిన ఇంద్ర ధనుస్సు నా సౌందర్యంతో పోటీ పడాలి 
పువ్వుల శ్వాస సంగీతాలు ఆలపించాలి 
గాలి తుమ్మెద ఝూంకారాలు చేస్తూ.. నా అధరాల సుధలను గ్రోలాలో, లేక ఆ సుమ కుసుమాల మధువును తాగాలో తెలియక తికమకపడాలి 
నల్లని నా కురుల చారలు కొలనులా కొలువుతీరాలి 
అందులో రాజ హంసలు జలకాలాడాలి 
నా శృంగార ప్రతిమ అక్కడ ఉండగా ఒక్క ప్రియుడైనా తమను తొంగి చూడట్లేదని అలలు తమలో తాము కలవరపడి నా కాళ్లకు అల్లుకుపోవాలి 
ఆ తటిల్లతల తల పొగరు తగ్గించామన్న గర్వంతో నా స్తనాలు శిఖరాలవ్వాలి 
ఆ పరువం వెలుగుకు వెలుతురు పొగచూరి పోవాలి 
అరచీకట్లలోని మత్తు నా మనసును మరలుగొల్పాలి 
సరిగ్గా అప్పుడు..  ఆ అరవెలుతురులో, వాలిపోయిన ఆ నెలవంక మాటు నుంచీ ఏ దివ్య లోకాల నుంచో ఓ చెలికాడు నన్ను తొంగి చూడాలి... 
ఇక ఈ విరహాన్ని చాలించి.. నేనీ స్వర్గ సరోవరంతో పాటు అతనున్నవైపుకు ఎగిరిపోవాలి!... 

Sunday, March 2, 2014

నా ప్రయాణం మొదలయ్యింది...

భూమి బుగ్గలపై ఆకాశం చిటికెలేస్తున్నట్లు... కురుస్తున్నాయి వాన చినుకులు!
అది నేల పరవశమో, నింగి పలకరింపో, చినుకుల చిలకరింతో.. ఏదో తెలియదు కాని, ఉద్విగ్నమైన ఒక భావం...!
కుండపోత వానలో...
కుమ్మరించే మంచులో...
కుత, కుతలాడించే ఎండలో...


ఏదో ఓ చోట, ఏదో ఓ లా.. అలా భూమిని తాకక పొతే ఈ క్షణమే నా జీవిత పర్యంత నిరీక్షణం.. వృధా పోతుందనే కలవరం...
చూపులు స్పృశించినంత ధారాళంగా భూగోళాన్ని నగ్నాలింగనం చేసుకోలేని మానవ శరీరం.. భూమికి చెందినది కాదేమో!!!
రమణీయమైన భూమి సౌందర్యాన్ని, స్వాభావాన్నీ, సారళ్యాన్నీ అణువణువూ తాకి అనుభవించగల వేరే జీవులకు.. సొంత నేలేమో ఈ గ్రహం!!!

పరుగులు తీయాలి... ఎక్కడికో ఓ చోటుకి.. లోయలను తవ్వి పక్కనే పర్వతాలుగా పేర్చినదెవరో, కనుక్కోవాలి, భూమ్యాకాశాలు కలిసే బొమ్మను గీసిందెవరో, కనిపెట్టాలి, భూ వనమంతా ఊపిరాడనివ్వనంత ప్రేమను ఊహాగానం, చేసిందెవరో, రాబట్టాలి రహష్యం,...

... ఈ నిర్వాసిత మానవ హృదయానికి భరించనలవి కాని ఈ ప్రేమను, పంచి పెట్టాలి, ఇక్కడే, ఈ భూమ్మీదే, ఇక్కడి ఉప్పు తిన్న ఋణం ఇక్కడే తీర్చుకోవాలి, భారం దించేసుకోవాలి..! నిలువ నీడనిచ్చిన భూమికి తోడు పడాలి!!

నా దేహాన్ని ఈ గాలి ఈలల్లొ విలీనం చేయాలి. ఈ ఆకుల వర్ణంలో మిళనం చెందాలి, ఈ అణువుల మనసుతో మమేకం అవ్వాలి, అంత కన్నా ముందు వియోగులైన ఈ మనుష్యుల హృదయాలతో సంయోగం చెందాలి, నా వంతుగా ఈ విరాళాలను ధారాళంగా సేకరించాలి!...

నేనెక్కడికో పారిపోవాలి.., ఈ అనంతం హృదయంలో నాదైన చోటు కోసం.. నాదైన పరవశం కోసం, నాదైన అనుభవం కోసం...! 

పెట్టిన చోటును మరచి పోయి, దాచిన వస్తువు కోసం గదంతా చిందర వందర చేసినట్లు, జాడ తెలియకుండా దాక్కున్న ప్రేమ కోసం.. ఈ భూమంతా కలగా పులగంగా తిరిగెయ్యాలి..! 

ఎంత వెదికినా దొరక్కపోతే, అక్కడికక్కడే, ఎక్కడికక్కడ.. నా హృదయం పగిలిపోకుండా, తత్కాల స్వాంతన కోసం కొన్ని 'అత్యవసర హృదయాలను' కృత్రిమంగా అయినా సరే సమకూర్చుకోవాలి..!  

ఆకాశం నేలకు ఇన్ని చినుకుల ప్రేమను పంచుతుందంటే.. ఆ మాత్రం ఓ చిటికెడు ప్రేమ నాకు మాత్రం దక్కక పోదు. చూస్తుంటే భూమి బుగ్గల మీది పరవశం నా మనసును కూడా కమ్మేస్తున్నట్లు.. వేడి ఆవిర్లు నా చెవుల్లో గుస,గుసలాడుతున్నాయి.., ఇదే నా బాధ, ఇంత గుబులును నా గుండె ఒంటరిగా మోయలేక పోతోంది. అంతూ పొంతూ లేని అగాథంలా మానవ హృదయం.. ఎన్ని గులకరాళ్లను వేస్తే మాత్రం... ఎప్పుడు నిండుతుందో తెలియట్లేదు!!! ఎవరైనా మాయ చేసి, ప్రేమామృతం మెండుగా ఉండే సంజీవనీ పర్వతాలను తెచ్చి ఈ లోయలను పూరిస్తే... బాగుంటుంది చాలా!!! 

సంజీవనీ పర్వతాలను సాకారం చేసే మాయ మన మనసులోనే ఉంది మరి, So, Start Action.. Ready Steady Go Po... 
...మానస సంచారం/యోగ ధ్యానం OR భూసంచారం/Traveling... 

Time మాత్రం waste చేయకూడదు, అంతే!   

నా ప్రయాణం మొదలయ్యింది...