Thursday, July 25, 2013

కలలో నీ కోసం పొద్దుతిరుగుడు పువ్వై పూచిన నేను!

రాత్రి!
రాత్రి అంటే.. ఇంతకు ముందైతే.. చీకటి దిక్కులు, మెరిసే చుక్కలు 
చలిగాలులో లేక చిరుగాలులో లేక చిరు జల్లులో, కాని, 
నువ్వు కలిశాక.. రాత్రుల అర్థమే మారిపోయింది.  
ప్రతి రాత్రి ఒక అందమైన కలలా కమ్మగా.. కళ్లు మూసి ఒక కొత్త లోకంలోకి మేలుకున్నట్లు.. 
ఒక్కసారిగా మెలకువ రాగానే...  
నువ్వు నా కళ్ల ముందుంటావు!

.. ప్రతి రేయి లాగే  కలలోకి వచ్చావు 
నా అందమైన ముఖం మీద నీ ముఖం ఆన్చావు.. 
నీ చెంపలు నా చెక్కిళ్లతో యుద్ధం చేశాయి 
మన ఇరువురి శ్వాసలు కాల సర్పాల్లా కలిసి నాట్యం చేశాయి, 
విచిత్రమేంటంటే అవి మన ఉనికినే మరచిపోయాయి! 
ఒక రైతు భూమిని దున్ని సాగుచేసినట్లు... 
నీ దవడ ఎముకలు... నా ముఖ క్షేత్రాన్ని క్షతగాత్రం చేస్తూ సేద్యం చేశాయి  
ఏవో పూల మొక్కల కోసం కాదు, ఏదో పెద్ద పంటే పండించాలన్న నీ ఉద్దేశం నాకు అర్థమయ్యింది. 

నూనూగు మీసాల నీ చిరుగడ్డం నా మెడ వంపుల వొంకలో కొత్త దారులు వెదికింది 
ఇంతక ముందు అక్కడెప్పుడూ ఎవ్వరూ ఏమీ దొరకబుచ్చుకోలేదు. 
రెప్ప పాటు దూరంలో నాలుగు కళ్ళు కలుసుకున్నాయి.. 
నీ చూపులు నా అంతరాంతరాలలోని నాకే తెలియని మార్మిక లోకాల లోకి ద్వారాలు తెరిచాయి 
అదొక మజిలీ మాత్రమే, అసలు గమ్యాలు ఎక్కడో మిగిలే ఉన్నాయి!

అవి నీ చేతి వేళ్లో, లేక అదురూ బెదురూ లేని నీ పెదాలో.., 
నా పెదవులపై అవి మధుర సంగీతాలు పలికించాయి, 
విచిత్రమేంటంటే ఆ సంగీతాన్ని మన చెవులు ఎంత మాత్రమూ వినిపించుకోలేదు. 
అది ముద్దనుకోటానికి కూడా లేదు, రెండు భౌతిక శరీరాల మధ్య ఆ రెండు ప్రాణాలూ వేసుకుంటున్న వంతెనలా ఉంది. 
ఆ కట్టడంలో ఉన్న నైపుణ్యం ఏమిటో, మెలకువలేమిటో.. ఎంత కూపీ లాగినా.. తుది మొదల్లేవో ఏమీ అంతు చిక్కడం లేదు.. 
ఈ అద్భుతం జరగడానికి కాస్త ముందు.. పెదవుల్లో గండు చీమలు కోరికినట్లున్న బాధ మాత్రమే నాకు గుర్తుంది, 
అసంపూర్ణమైన రెండు అర్ధ వృత్తాల్లాంటి మన ప్రాణాలు సంపూర్ణం అవ్వటం తప్ప ఇందులో ఏ గొప్ప రహస్యమూ లేదనుకుంటా!

అలా నా అస్తిత్వ్వనికి చెందిన సమస్తమూ నీకు దాసోహం అయ్యింది.. 
ఇది తెలిసిన మరుక్షణమే నువ్వు నా హృదయ రాజ్యాన్ని నీ సొంతం చేసుకున్నావు. 
ఆ సింహాసనానికి నువ్వే రాజువని నీకు తెలియగానే, సరాసరి రాజధానికే చేరుకున్నావు.. 
అగ్ని పర్వతం హృదయంలోకే లావా వెనుదిరిగి పరుగెట్టినట్లు.. లోయ జాడ తెలిసిన వెంటనే జలపాతం దూకినట్లు.. 
నీ భావనలే కాదు, నీ బాహువులు కూడా నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి 
ప్రేమ నిండిన గుండె బలానికి, ఆ గుండెను మోస్తున్న కండ బలానికీ బందీనయ్యా, నా హృదయంలో నేనే కాందిశీకురాలినయ్యా!

ఇంతలో... 
... ఇంతలో ఉన్నట్లుండి మాయమయ్యావు.. సుదూర ఆకాశంలోని మబ్బుల్లో మబ్బులా కలిసిపోయావు 
నీ చేతులు విసిరేసిన నా శరీరం.. చెల్లా చెదరైన అడవిలా భూమంతా ఆక్రమించింది.. నా ఆక్రందనల్లో నీ పేరు మారుమోగి పోయింది... 
ఆ ప్రతి ధ్వనికి మబ్బుల హృదయం కరిగి.. ఆ కన్నీరు వానలా కురిసింది... 
.. వాన వెలిసిన నీలాకాశం నిర్మలంగా మెరిసింది. 
అప్పుడే స్నానం చేసినట్లున్న సూర్యుని వెలుగులో నీ రూపం వెచ్చని చిరునవ్వులు రువ్వింది.. 
ఆ గోరువెచ్చని స్పర్శతో నేను.. నీకు అత్యంత ఇష్టమైన పొద్దు తిరుగుడు పువ్వైపోయాను!
వెచ్చని కిరణాలు మరింత చొరవగా నా ముఖాన్ని ముద్దాడసాగాయి..
ఆ స్పర్శ.. అచ్చంగా మళ్లీ, నా అందమైన ముఖం మీద నీ ముఖం ఆన్చినట్లు...

... భావాల ప్రచురణలో ఈ భాషల గోడలు, మాటల ఇటుకలూ లేకుంటే... కలలోని మన ప్రతి కలయిక గురించీ కోటి పేజీల కోవెల కట్టుకునేవాళ్లం..!

Wednesday, July 24, 2013

భూభ్రమణం


అన్నం, తోటకూర మెంతి పప్పు, కాకరకాయ వేపుడు.. టమోటా చెట్నీ... బయట ఎండారబోస్తూ సూర్యుడు... 
వాసన చేతి మీద 
రుచి నాలుక మీద 
అనుభూతి నరాల మీద.. 
ఎండ నా మీద! 
జీవితం వానా కాలం మధ్యాహ్నాలుగా 
ఎండా కాలం సాయంత్రాలుగా 
చలికాలం రాత్రుల్లుగా ఉంటే ఎంతో మధురం!
ఈ విషయం తలపుకు రాగానే.. 
కుంపట్లో మొలకలు వేసిన కొత్తిమీర పిలకల సాక్షిగా మనసు పులకలు వేస్తోంది.  

చెంబు నీళ్లు.. గ్లాసు తేనీరు పిడికెడు అన్నం.. చిటికెడు ప్రేమ.., 
శరీరం మనసు లాగా మరీ ఎక్కువ కోరికలు కోరదుగా!
మొన్నొక సారి పాత గురువు గారొకరు కలిస్తే.. 
ఎలా ఉన్నారని అడిగిన పాపానికి అడగకుండానే ఇంకో జీవిత పాఠం నేర్పాడు, మహానుభావుడు!
పాడుబడిన ఊళ్లో, పాత ఇంట్లో కొత్త అన్నం తింటూ కొత్త నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నానన్నాడు... 
నా చేత్తో పెట్టిన కమ్మటి భోజనం -ఆయన కితాబిచ్చారు మరి- తిని... 
వస్తావు పాత ఇంటికి.. ఇక్కడ కొత్త పల్లెరాల్లో పాత భోజనం అలవాటు పాటిస్తున్నావు 
పాతింటికి వచ్చాక పాత గ్లాసుల్లో కొత్త రసాలు తాగుతావు అంటూ ఆశీర్వదించారు!

అది నిజమయ్యేలా ఉందని అనిపిస్తుంది.., సరిగా ఇలాంటప్పుడే..  
ఏ మధ్యాహ్నపు భోజనం వేళో మస్తిష్కం అరల్లోని జ్ఞాపకాల దొంతరలు మతికి వచ్చినప్పుడు..!

ఒక్క గంటలో తాకిన గాలుల అలలు 
నిముషం నాట్యానికే పరిచయమై ప్రాణ నేస్తమైపోయిన నీటి స్నేహం  
ఒక్క పూటలో వెయ్యేళ్ల సూర్యున్ని ఆస్వాదించిన నింపాదితనం.. 
ఒక రేయిలో అనుభవించిన లక్ష పున్నముల వెన్నెలలు 
ఒక్క రోజులో కోటి సంవత్సరాల భూమి స్పర్శ... 
చలిమంటల కాంతి, మెరుపుల కాగడాలు 
ఆకాశంలో చేసిన విహార యాత్రలు, నక్షత్రాల లెక్కలు 
చీకట్లో పెట్టిన పరుగులు, రాళ్ల మీద ఆడిన గీతలాటలు
చెట్ల కొమ్మల ఊయలలు, కోనేట్లో కొట్టిన ఈతలు... 

... వందేళ్లు తక్కువనుకుంటాం గానీ.., భూమ్మీద కూడా కాలంతో పనిలేని స్థలాలున్నాయి!
అవి మనలోనే, మనతోనే ఉంటాయి. మన జీవితంలా మన చుట్టూ భూభ్రమణం చేస్తుంటాయి... ((((((((()))))))))  

Wednesday, May 8, 2013

కావ్య కన్యకల కన్యా దానాలు..


కవికి కన్నీళ్లు లేకపోతే చదివేవారికి కన్నీళ్లు రావు. 
కవికి భావోద్వేగాలు లేకపోతే పాఠకుడికీ భావోద్వేగాలు కలగవు. 
కవిత్వమంటే... జీవితాన్ని మాటల్లో చెప్పడం, 
కవిత్వమంటే... కలల్ని అందంగా కళ్ల ముందు ఉంచడం, 
కవిత్వమంటే... వాక్యాల్లో సీతాకోక చిలుకల అందం, 
ప్రేమ పరవళ్లు, సున్నితమైన శృంగారం.. 
భావాల్లో ఉద్వేగాలు ఉరకలు వేస్తుంటే.. 
కవితల్లో పదాలు పరుగులు తీస్తుంటాయి.  
పరువం పలికే పాటైనా, లక్ష్యం చేర్చే ఆటైనా.. 
అక్షరాల ముగ్గులో అందంగా చిత్రితమవుతాయి. 
నా సున్నితమైన వేలి కొనలు చిందించే రసధారలు తాగిన మత్తులో.. 
నేనే మునిగి తేలే క్షణాలు, 
ప్రియుడినై, ప్రియురాలినై నన్ను నేనే కౌగిలించుకున్న స్థలాలు... 
పెనవేసుకున్న కాలంతో ముడి వేసుకున్న బంధాలు... 
లక్షితనై, లక్షాన్నై పొందిన శర వేగం లోని అనుభూతుల అనుభవాలు.. 
మందారాలో, మల్లెలో... దారాలకు గుది గుచ్చే పూల గుత్తులు ఏవైనా.., 
కావ్య కన్యకలను ఆ పూలల్లో పెట్టి కన్యా దానాలు చేస్తేనే నా కవి హృదికి శాంతి!


Tuesday, May 7, 2013

Dream is REAL


ఒక రోజు చందమామ అద్భుతంగా ఉంటుంది 
మరో రోజు చూడ్డానికి ఇష్టపడనంత 'పగిలిన బంతిలా' ఉంటుంది.
ఒకే చంద్రుడు... కానీ భూమి స్థానమో, మన మనసు లోని ఆస్వాదనమో మారుతూ ఉంటుంది!

జననం వేడుక... మరణం విషాదం...
మధ్యలో... ఎన్నో సంతోషాలు, దుఃఖాలు...మనల్ని వెంటాడుతూ ఉంటాయి !

ప్రేమంటే అందరికీ ప్రేమే
కానీ, కొంతమందే ఆ సామ్రాజ్యాన్ని తమకు అంకితం చేసుకుంటారు!

అవసరం 
అసూయ
ద్వేషం
కోపం
పగ.. ప్రేమ..
సంతోషం,దుఃఖం...
ఇవన్నీ చచ్చేదాకా మనతో పాటే ప్రయాణిస్తాయి....

.....ఇలాంటి ఎన్నో అనుభూతులు అనుభవాలవుతాయి.
     అవే జీవిత జ్ఞాపకాలవుతాయి.
....ఆ ఊహల్ని మొలకెత్తించే 'గులాబీల తోటలను'
అక్షరాలుగా మారిస్తే........
...........కథలవుతాయి 
...........కవితలవుతాయి 
సరికొత్త రచనలవుతాయి!


Sunday, January 6, 2013

ముగ్గురమ్మాయిల ఫ్రేమ్..

ఈ ముగ్గురమ్మాయిల ఫ్రేం నాకెంతో అచ్చిబుచ్చిగా నచ్చినదీ, అచ్చొచ్చినది... నాకు ఎప్పడూ ఇద్దరిద్దరు స్నేహితులు, ఇద్దరిద్దరు కజిన్స్ ఉండే వాళ్లు!
మొత్తానికి నేను చెబుతుంటే వినడానికి ఇద్దరుండే వాళ్లు!
... నాకు జ్ఞానముండి వాళ్లకు చెప్పే దాన్నో.., వాళ్లకు చెప్పడం వల్ల నాకు జ్ఞానం వచ్చేదో కానీ.. చెప్పటమైతే ఉండేది!!! 

మరి నా ఫ్రేమ్ లోని నా నా స్నేహితులు :-
*మూడేళ్ల లోపు.. neighborhood/ ఇంటి చుట్టు పక్కల...
నిమ్మి(నిర్మల), బొమ్మక్క(ఇది చిన్నప్పుడు నేను పిలిచే పేరు. నాగేశ్వరి అట ఆమె పేరు పెద్ద అయ్యాక తెలిసింది.)లతో... 
ఏమేం ఆడుకునేవాళ్లమో ఎక్షాక్ట్లీగా గుర్తు లేదు కానీ, 
ఆ రోజుల్లో ఆ వయసులో ఆడుకునే అన్ని ఆటలూ, పాటలూ...

*బాగా చిన్నప్పుడు..
బేబీ క్లాసులోలేక ఇప్పటి ప్రీ స్కూల్ లా ఎవరో టీచర్ దగ్గరికి పంపే రోజుల్లో?...
ప్రమీల, ప్రసాద్(అక్కా తమ్ముళ్లు)తో..
గిల్లి కజ్జాలూ, గిల్లుకోవడాలూ  గిచ్చుకోవడాలూ, 
బలపాలూ, పెన్సిల్లూ లాక్కోవడాలూ జుట్ల కుస్తీలూ, 

ట్యూషన్ క్లాసుల్లో దీపాలతో, పేపర్లతో కాల్చుకోవడాలూ...
(ప్రమీల గోర్లతో రక్కిన జ్ఞాపకాల భయం, 
ప్రసాద్ క్రోవ్వోత్తికి సూపర్ కవర్ కాల్చి, నా చేతి మీద కాల్చిన గుర్తులూ ఇంకా ఉన్నాయి!!!)

*కాన్వెంట్ స్వీట్ హార్ట్స్..
అరుణ, రాణీ చెన్నమ్మ(కజిన్స్)తో..  
బొమ్మల పెళ్ళిళ్లు, ఉత్తుత్తి వంటలూ, 
పిచ్చుక గూళ్లు, పావులూ, 
బొమ్మలాటలూ, అల్లర్లూ...  

*కొంచెం పెద్దయ్యాక..
రమా దేవి, ధన లక్ష్మి(అక్కా చెల్లెళ్లు)తో
వాళ్లిద్దరూ సిస్టర్స్, ఇంట్లో రాముడూ, కృష్ణుడూ అని పిలిచే వాళ్లు
నేను.. రమా.., కృష్ణా..-కిట్టు-కిట్టాయి-అని పిలిచే దాన్ని..
అబ్బో ఎన్ని కబుర్లో, ఏం ఆటలో, ఏం మాటలో, ఎన్నెన్ని పాటలో...
వసారాలో ఊగే ఉయ్యాలలు...
ముళ్ల జాజి పొదల్లో, మల్లె పందిళ్ల కింద సినిమా పాటలు 
కనకాంబరాల మడిలో సేద్యము...
పుస్తకాల ఒడిలో రసాస్వాదము..
సీమ చింత చెట్ల కింద జీవిత సత్యాలు..
మేడ మెట్ల మీద కథలూ, కవిత్వాలు...
రెండు పూర్తి దశాబ్ధాల దీర్ఘకాలిక స్నేహ సౌరభం!...

*మిడ్ స్కూల్ ఫ్రెండ్స్..
ఉమా గైర్వాణీ, మాధవిలతో..
యోగా క్లాసులూ, కరాటే పంచులూ, 
షాంపూలు, శాండిల్ చెప్పుల అలవాట్లు, 
సంస్కృతం చదువులూ, సంగీతం సాధనలూ...  

*హై స్కూల్ స్వీట్ హార్ట్స్..
బాల భారతి, నాగ మణిలతో
మ్యాథ్స్, సైన్స్ చదువులో పోటీ ఒకరితో, 
సినిమాలూ, షికార్లూ, పుకార్లూ ఇంకొకరితో..

*తొట్ట తొలి కాలేజీ మిత్రులు..  
రహమాద్ బీ, షంషూరున్నిషాలతో...
బాడ్మింటన్ ఆటలూ, విద్యార్థి రాజకీయాలు, 
చుడీదారు షాపింగ్ లూ, మిడ్డీల రెవల్యూషన్ 
బయోలజీ ప్రాక్టికల్స్, హిందీ భాషా పరీక్షలూ..

*మరో సంవత్సరం కాలేజీ మిత్రులు...  
నర్మద, పుష్ప లతలతో..
శివ రాత్రి జాతరలు, తిరునాళ్లు, 
స్నేహితుల ఊళ్ళల్లో పండగలూ 
పోక పొరుగింటికి పోయి రాక రెండు మాటలు తెచ్చికోవడం 
ఒకటి సమాజాన్ని అర్థం చేసుకోవడం, 
రెండు, మనల్ని మనం అర్థం చేసుకోవడం 
సినిమాలు, పాస్పోర్ట్ ఫోటో సెషన్లు, ఎక్షామ్స్ ప్రిపరేసన్స్ ...

*K.V.R కాలేజీ ఫ్రెండ్స్..
మైత్రేయీ, రోహిణిలతో...  
వరుసగా పుస్తకాలూ, రచనల చర్చలు ఒకరితో, 
బాడ్మింటన్ వాలీబాల్ గేమ్స్, 
రన్నింగ్, అథ్లెటిక్స్ ప్రాక్టీసులూ, పార్టిసిపేషన్స్ ఒకరితో...  

*K.V.R కాలేజీ హాస్టల్లో...
క్లాస్మేట్స్, రూమ్మేట్స్...  
తులసి, రోజీ(రోజా రమణి)లతో...
ఇంకా హాస్టల్ అక్కలు...
ధరణి, వెంకటరమణమ్మ
ప్రత్యూష, నీలిమ
స్పోర్ట్స్ లో..
లతా రెడ్డి, పుష్పావతి
రంగమ్మ అక్క, అనంత అక్క...
(ఇంకా ఛాలా మంది పేర్లు, ముఖాలు మ్యాచ్ అయ్యేలా గుర్తుకు రావడంలేదు)లతో...
హాస్టల్ లో వంటకాలు, తీసుకెళ్లిన పచ్చళ్లు..
దొంగ పర్మిషన్లతో సినిమాలు, బర్త్ డే పార్టీలకు ఐస్ క్రీం పార్లల్ లు,
షాపింగ్ లు, షిరిడీ సాయి దర్శనాలు, నేను చెప్పే కథలూ, కవిత్వాలూ..

*ఇక కజిన్స్ అయితే...
గీతా వాణి, భార్గవీ లత
భార్గవి ముందు రాసిన రాతలు.., గీతక్క ముందు కోసిన కోతలు
సంక్రాంతి ముగ్గులు.., దీపావళి అరిసెలు..
శీతాకాలం చలిమంటలు, రేగు పల్లు
వేసవి గోలీ సోడాలు, K.C canal ఈతలు...
వానల్లో ఆటలు, సుడి గాలులతో స్నేహాలు...
సైన్స్ ప్రయోగాలూ, నేను చెప్పే సైన్స్ -ఫిక్షన్-కబుర్లు  
నోటుపుస్తకాల్లో నేను రాసిన నవలల రాతలు...
వాటిని పూర్తిగా రాయక నేను సతాయించే సతాయింపులూ
ఆ సస్పెన్స్ తట్టుకోలేక నేను రాయడానికి నన్ను కూచోబెట్టి వాళ్లు చేసే సేవలు...
చిరాకొచ్చి వాళ్లకు వాళ్లే ఒక ముగింపు రాసుకుని తృప్తి పడిన క్షణాలు...

*అమ్మమ్మా వాళ్ల ఊరికి వెళ్తే.. అక్కడి కజిన్స్ తో...
సీత, అనసూయ,
అరుణ, సుమిత్ర
శ్రీనన్నా, ఆది అన్నలతో..
చెట్టు మీది చింత చిగురు, గాజె లోని బెల్లం, వేప్పండ్లతో చింత గొజ్జు
నేను చెప్పే సినిమా కథలు, వాళ్లు చెప్పే జానపదాలు...
మధ్య, మధ్యలో మామ హార్మోనియం పెట్టె, వీధి అరుగు పై వీరబ్రహ్మేంద్ర స్వామి డ్రామా రిహార్సల్స్...
చింత చెట్టు కింద దెయ్యాల జీవిత కథలు... వేప చెట్టుకు తాళ్లేసి రోకలిబండ పెట్టి తొక్కుడుయ్యాలా...
వేడి వేడి జొన్న రొట్టెలకు, తడి వెన్నపూస పూసి సాయంకాలాలు తిన్న స్నాక్స్...
తాటాకు పందిళ్ల కింద బార కట్ట ఆడుతే జరిగే యుద్ధాలు.. అచ్చంకాయలు ఆడేటప్పుడు కోపంతో రాలే పల్లు...
సున్ని పిండి, కుంకుడు కాయలతో ఇంకుడు గుంతలో స్నానాలు...
కజ్జి కాయలు, కాళ్ల గజ్జెలు.. ముక్కు పుడకలు, పచ్చ బొట్లు..
కాసుల పేరు, పచ్చల హారం, పగడాల దండలతో అలంకారాలూ ..
జడ కుప్పెలు, పూల జడలు
ఇంట్లో పరంపరగా వస్తోన్న లక్ష్మీ ఆవుకు పుట్టిన ఐదో కొడుకుతో అందరికీ లవ్వు...

ఇంకా...
*"ఓం శాంతి"లో తోడుండిన విజయ, మీరాలూ
*ఆశ్రమంలో రమణీ, గౌరీలూ
ఇంకా..
*ఆధ్యాత్మికం, పోస్ట్ మోడర్నిజం, 
న్యూ ఏజ్ స్పిరిత్చ్యువలిజం వగైరా వగైరా 
ఎన్నో విస్తృత అంశాల మీద 
విస్తృతంగా కలిసీ, 
ఎన్నెన్నో విస్తృత అధ్యయనాలు చేసిన...
కలీమ్, మూర్తి
దామోదర్, విజ్జి...
 
*కుండలినీ దీక్షల్లో.. 
సాధనలో కలిసే.. 
మెడిటేషన్ రవి, కిరణ్ లూ  

**అందరి కన్నా ఎక్కువగా నిత్యం ఇంట్లోనే ఉండే...
సొంత తమ్ముల్లు.. ధర్మ క్షేత్ర, ధర్మ రక్ష..
*ఇంకా అప్పుడప్పుడూ, లేదా ఎప్పుడెప్పుడూ
నా అజామాయిషీలో చదువులూ, జీవితాలూ సాగించిన..
కజిన్స్ హేమ చంద్రా, మహేంద్ర..
*అడపా, దడపా కలిసే సెకండ్ కజిన్స్..
*ఊర్లో వరుసలు పెట్టి పిలిచే బ్రదర్స్, సిస్టర్స్, మరదల్స్, బావాస్...
లక్ష్మి కాంత, అరుంధతి అనే కోడళ్లు
శ్రీనూ, దామోదర్,
జగన్, రవీంద్రా అనే తమ్ముళ్లూ..
తనూజా, శ్రీదేవీ అనే చెల్లెల్లూ...
అశోక్, నర్శింహా ,
వేణు, గోపి,
గిరి, గోపాల్ వగైరా బామ్మరుదులూ  

***ఇంకా చాలా చాలా మంది చాలా చాలా రకాల ఫ్రెండ్స్, కజిన్స్...
"నేను - నాతో ఇద్దరు".. అప్పుడప్పుడూ ఎక్కువే అయ్యే వాళ్లం కాని, 
ఎప్పుడూ ముగ్గురికి తక్కువ అయ్యి బ్రతికిందే లేదు!
...............................................................
ఉఫ్ఫ్....once upon a time... బానే బతికాను..! అందరం ఇలానే బతికే వాళ్లం, అందంగా, ఆనందంగా. 
కానీ..
ఇప్పుడే మాయదారి ప్రపంచం మనుష్యుల్ని శూన్య సొరంగాల్లోకి లాగేస్తోంది.... ఎవరి బ్లాక్ హొల్ వాళ్లు సొంత ఇల్లు కట్టుకున్నట్లు కట్టుకుంటున్నారు. 
.... అందరం ఇంకా బ్రతికే ఉన్నాం, కాని కమ్మని బ్రతుకయితే లేదు. బ్రతుకులో ఏ కమ్మదనమూ లేదు, ఎవరికీ ఇంకొకరి తోడు లేదు!

" నేనొచ్చినా వాళ్లు రారో... వాళ్లు వచ్చినా  నేను రానో"............
అసలు ఎవరి జీవితాల్లో వాళ్లు మునిగిపోయామో, కూరుకుపోయామో, ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇసుక మేటల్లాగా ఎక్కడకు వెళ్లిన వాళ్లు అక్కడ పేరుకుపోయామో...
 
..... నాకు మాత్రం "ముగ్గురమ్మాయిల ఫ్రేం" మళ్లీ దొరకట్లేదు... :( 
(నాకే కాదు బయట ఎవరినైనా చూద్దామన్నా దొరకట్లేదు.)
అక్కడక్కడా చాలా చోట్ల అబ్బాయిలు ఉన్నప్పటికీ ఆయా అనుబంధాల జ్ఞాపకాలు అచ్చంగా ఈ "ముగ్గురమ్మాయిల ఫ్రేం"కు చాలా దగ్గరగా పోలి ఉన్నాయి.

బహుశా, చాలా చాలా ఉన్న ఈ "ఇద్దరిద్దరు మిత్రులు" నా జీవితంలో ఉండటం వల్లనో, లేక నేనింకా ఆ జ్ఞాపకాలు ఉంచుకోవడం వల్లనో ఈ "నేను" తయారయ్యాననుకుంటా! 

ఈ అనుబంధాల జ్ఞాపకం ఇరవై ఏళ్ళ క్రితం పుట్టిన వాళ్లకందరికీ ఉంటుందీ, ఉండేదే. కానీ సమీప కాలం నుంచే రూపాయికి విలువ లేకుండా పోయినట్లు ఒక మనిషికి ఇంకో మనిషంటే విలువలేకుండా పోయింది.
మానవ సంబంధాలు ఎంత త్వరగా మారిపోయాయో ఈ శతాబ్ధంలో.. కనీసం ఈ ఒకటీ, రెండు దశాబ్ధాల్లోనే అనూహ్యమైన మార్పులు! మనిషికి మనిషి, ముఖానికి ముఖం కనిపించే రోజులే పోయాయి. కలిసి అన్నం తినే వాళ్లే లేరు. అంటే మరి, ఒక బంధం, బంధుత్వం ఉన్న వాళ్లే ఎవరి చట్నీ, ఎవరి పిజ్జా, ఎవరి బిర్యానీ, ఎవరి బిస్కట్లు వాళ్లు తినే పరిస్థితి. ఎక్కడ చూసినా వస్తువులూ, టెక్నాలజీ, స్పీడ్.. ఎవరి బతుకులు వాళ్లవి, ప్రతి రెండో వ్యక్తీ "పక్క"వాడే! 

ఒక ఊరు, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతీ, ఒక కమ్యూనిటీ.. కలిసుండే ఉమ్మడి కుటుంబాలూ ఎప్పుడో పోగా, ఇద్దరు తల్లితండ్రులూ ఒక సంతానమూ.. మొత్తం కలిసి ముచ్చుగా ముగ్గురుండే న్యూక్లియర్ కుటుంబాలకు కూడా కాలం చెల్లిపోయి, ఉన్న ఆ ఒక్క కొడుకో, కూతురో వారి సొంత జీవితాలకు వాళ్లు వలసపోతున్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు ఇంకొకరిని పట్టించుకోకుండా ఎవరి టెక్నాలజీలో వాళ్లు ఉండిపోవచ్చు లేదా మరీ తొందరగా ఉన్న వాళ్లు "వెళ్లి"పోయే ఉండవచ్చు. మనిషి సంఘ జీవి అంటారు. (నిజానికి అన్ని జీవ రాశులూ సంఘ జీవనమే గడుపుతాయి. అంతెందుకూ రాళ్లూ,రప్పలు కొండలు, గుట్టలుగా సంఘ జీవనం చేస్తాయి. చెట్టూ,చేమలూ వనాలూ, అరణ్యాలుగా సంఘ జీవనం చేస్తాయి. చెప్పాలంటే అనంత విశ్వంలో.. ఖగోళ గ్రహాలూ, రాశులూ, నక్షత్రాలూ.. వగైరా వగైరా సంఘ జీవనమేగా చేస్తున్నాయి...!!!!!!!!!.....) 
కానీ నేడు మనిషి ఏకాకి. సంఘమే లేదు. మానవ సమాజమే లేని నాడు, మానవుడే లేకుండా పోయేనాడు రావచ్చు!

ఇది ఇవ్వాళ్టి బేతాళ కథ! బేతాళ ప్రశ్న-?
తెలిసి, తెలిసీ మనషి ఇంత ఏకాకితనాన్ని, ఇలా అంతరించిపోయే క్షణాన్నీ ఎందుకు కొని తెచ్చుకుంటున్నాడు?
ఎందుకు?
ఎందుకని??
సమాధానం తెలిసి చెప్పకపోయారో మీ తల వెయ్యి వ్రక్కలవుతుందీ......................ఆ! 

- V Praveena Reddy