Sunday, January 9, 2011

..సెలవిక!

జీవితమంటే.. 
..అనురక్తే కానీ, అంతలోనే విరక్తి... 

చేసినవే చేయడం...
చూసినవే చూడడం...
తిన్నవే తినడం...
విన్నవే వినడం...
అన్నవే అనడం... 
...ఏ క్రమంలోనూ క్రమంతప్పని కర్మల క్రమాలు... 

నేర్చుకున్న పాఠాలే మళ్లీ మళ్లీ నేర్వడం 
చేసినతప్పులే మళ్లీ మళ్లీ చేయడం 
పొందిన శిక్షలే మళ్లీ మళ్లీ పొందడం.. 
అనుభవాలు.. వాటి చుట్టూ అవే తిరగడం!

నవ్విన నవ్వూ 
ఏడ్చిన ఏడుపూ 
అదే ఆవేశం, అదే ఆగడం.. 
కనీసం నాకు నేనైనా కొత్తగా లేను 
సంవత్సరాల తరబడి ఇదే పాత ముఖం!? 
చచ్చిపోయి మళ్లీ పుట్టుంటే కొత్త ముఖం వచ్చి, కొంచెం బాగుండేది!

పారిపోవాలనిపిస్తోంది... 
నిన్నటి కర్తవ్యాలు 
మొన్నటి బాధ్యతలు.. 
ఆ మొన్నటి కథలూ 
రేపటి పథకాలు.. 
కడపటి వాగ్ధానాలు 
మునుపటి వాగ్భాణాలు.. 
కదనుతొక్కే యుద్ధ రంగాలు 
అలుముకునే అంతరంగాలు..  
అసంపూర్ణమైన పనులు వెంటపడి వేధించని చోటుకి..,
పారిపోవాలనిపిస్తోంది! 

ఎన్నో ప్రయత్నాలు... 
ఎన్ని ప్రయత్నాలు!?... 
చేశాను, కానీ..  
ప్రపంచపటం నుండి తప్పించుకుని, పారిపోవడం.. 
కుదరనిదని అర్థమయిపోయింది, అందుకే ఇక.. 

...కొన్ని రోజులు వలసపోతున్నా... 

నా లోపల
లోలోపల ఉన్న 
పాతాళ లోకాలకు.. 
..అజ్ఞాత ప్రయాణం చేయడానికి వెళుతున్నా..! 

ఒక రోజు 
పది రోజులూ 
పది వారాలూ 
పది నెలలూ 
పది సంవత్సరాలూ 
పది జీవితాలూ
పది పది పదుల జన్మలూ.. 
..మళ్లీ, మళ్లీ రావటం తప్పదనీ తెలిసీ, 
మళ్లీ మళ్లీ వెళ్లటమూ తప్పదని వెళుతున్నాను.. 

విధ, విధాల.. వివిధ వలయాల విధిని వదిలించుకునే జ్ఞాన నిధికి.. వలస దారిని వెదుకుతూ.. సెలవిక!


Sunday, January 2, 2011

కాలం సంకెళ్లు వేయలేని.. "నేను"!

తన
హద్దులతో, ఆంక్షలతో
పరిస్థితులతో, పరిమితులతో
కంచెలతో, కొలతలతో
నన్ను బందీని చేసి ఇబ్బంది పెడుతోంది కాలం!

ఈ పని ఈ లోపే చేయాలి
ఈ పనికి ఇంత కాలం పడుతుంది
చెట్టు మొలవాలంటే ఎన్ని రోజులో
పూత పూయాలంటే, కాయ కాయాలంటే 
ఆ కాయ పండవ్వాలంటే కొంత కాలం...
మనిషి పుట్టాలన్నా కొన్ని నెలలు....
జీవితం కొన్ని సంవత్సరాలే!, ...
చావు కొన్నేళ్లకు....

అరె, సూర్యోదయం అవుతూనే లెయ్యాలి
గడియారం గంట కొట్టగానే పనిచేయాలి, తినాలి, తాగాలి
రాత్రవ్వగానే మళ్లీ పడుకోవాలి!, ...
మధ్య మధ్యలో... నచ్చినవీ, నచ్చనివీ 
మనకు నచ్చినవీ ఇతరులకు నచ్చినవీ
.................................................!

ఏం!?, ..
కాలంతో పనిలేని పనులు ఉండవా!
ఈ లోపే చెయ్యాలి...
ఈ లోపే చావాలి...
లాంటి నిర్బంధనాలు లేకుండా
చేస్తూ... జీవిస్తూ... వెళ్లే స్వేఛ్చ లేదా!?

ఎందుకని పొద్దున్నే తినాలి?
ఎందుకని రాత్రిలోగా పరుగెట్టి పని చేయాలి?
యేల ప్రతి వేళా.. 
వేళా, పాలలు చూసుకుంటూ...
ఎవరు బంధించారో కూడా తెలియకుండా, 
ఎందుకు కట్టుబడి కుములుతాం?!!

అయితే వందేళ్లు...
సగటున అరవై...
ఎవరు హద్దు గీశారని నేను దీనికి నిబద్దనవ్వాలి?
ఏం, ఎందుకని... 
నేను ఎన్ని రోజులు బ్రతకాలో...
ఎప్పుడు చావాలో... 
నా నిర్ణయాన్ని నేను తీసుకునే స్వేఛ్చ లేదా!!??

అందుకే... ఓ కాలమా...
నీ సంకెళ్లతో నన్ను బంధించవద్దని 
నిన్ను వేడుకుంటున్నాను..!
మెత్తగా చెబుతున్నానని మాట వినకపోతే...
నా దారికి అడ్డు రాకని నిన్ను ఆదేశిస్తున్నాను..!!
అప్పటికీ మాట వినకపోతే, ..... 
నీ హద్దుల అంతు చూసే ఆనకట్టకు 
blue print నా దగ్గరుందిలే...