Sunday, March 2, 2014

నా ప్రయాణం మొదలయ్యింది...

భూమి బుగ్గలపై ఆకాశం చిటికెలేస్తున్నట్లు... కురుస్తున్నాయి వాన చినుకులు!
అది నేల పరవశమో, నింగి పలకరింపో, చినుకుల చిలకరింతో.. ఏదో తెలియదు కాని, ఉద్విగ్నమైన ఒక భావం...!
కుండపోత వానలో...
కుమ్మరించే మంచులో...
కుత, కుతలాడించే ఎండలో...


ఏదో ఓ చోట, ఏదో ఓ లా.. అలా భూమిని తాకక పొతే ఈ క్షణమే నా జీవిత పర్యంత నిరీక్షణం.. వృధా పోతుందనే కలవరం...
చూపులు స్పృశించినంత ధారాళంగా భూగోళాన్ని నగ్నాలింగనం చేసుకోలేని మానవ శరీరం.. భూమికి చెందినది కాదేమో!!!
రమణీయమైన భూమి సౌందర్యాన్ని, స్వాభావాన్నీ, సారళ్యాన్నీ అణువణువూ తాకి అనుభవించగల వేరే జీవులకు.. సొంత నేలేమో ఈ గ్రహం!!!

పరుగులు తీయాలి... ఎక్కడికో ఓ చోటుకి.. లోయలను తవ్వి పక్కనే పర్వతాలుగా పేర్చినదెవరో, కనుక్కోవాలి, భూమ్యాకాశాలు కలిసే బొమ్మను గీసిందెవరో, కనిపెట్టాలి, భూ వనమంతా ఊపిరాడనివ్వనంత ప్రేమను ఊహాగానం, చేసిందెవరో, రాబట్టాలి రహష్యం,...

... ఈ నిర్వాసిత మానవ హృదయానికి భరించనలవి కాని ఈ ప్రేమను, పంచి పెట్టాలి, ఇక్కడే, ఈ భూమ్మీదే, ఇక్కడి ఉప్పు తిన్న ఋణం ఇక్కడే తీర్చుకోవాలి, భారం దించేసుకోవాలి..! నిలువ నీడనిచ్చిన భూమికి తోడు పడాలి!!

నా దేహాన్ని ఈ గాలి ఈలల్లొ విలీనం చేయాలి. ఈ ఆకుల వర్ణంలో మిళనం చెందాలి, ఈ అణువుల మనసుతో మమేకం అవ్వాలి, అంత కన్నా ముందు వియోగులైన ఈ మనుష్యుల హృదయాలతో సంయోగం చెందాలి, నా వంతుగా ఈ విరాళాలను ధారాళంగా సేకరించాలి!...

నేనెక్కడికో పారిపోవాలి.., ఈ అనంతం హృదయంలో నాదైన చోటు కోసం.. నాదైన పరవశం కోసం, నాదైన అనుభవం కోసం...! 

పెట్టిన చోటును మరచి పోయి, దాచిన వస్తువు కోసం గదంతా చిందర వందర చేసినట్లు, జాడ తెలియకుండా దాక్కున్న ప్రేమ కోసం.. ఈ భూమంతా కలగా పులగంగా తిరిగెయ్యాలి..! 

ఎంత వెదికినా దొరక్కపోతే, అక్కడికక్కడే, ఎక్కడికక్కడ.. నా హృదయం పగిలిపోకుండా, తత్కాల స్వాంతన కోసం కొన్ని 'అత్యవసర హృదయాలను' కృత్రిమంగా అయినా సరే సమకూర్చుకోవాలి..!  

ఆకాశం నేలకు ఇన్ని చినుకుల ప్రేమను పంచుతుందంటే.. ఆ మాత్రం ఓ చిటికెడు ప్రేమ నాకు మాత్రం దక్కక పోదు. చూస్తుంటే భూమి బుగ్గల మీది పరవశం నా మనసును కూడా కమ్మేస్తున్నట్లు.. వేడి ఆవిర్లు నా చెవుల్లో గుస,గుసలాడుతున్నాయి.., ఇదే నా బాధ, ఇంత గుబులును నా గుండె ఒంటరిగా మోయలేక పోతోంది. అంతూ పొంతూ లేని అగాథంలా మానవ హృదయం.. ఎన్ని గులకరాళ్లను వేస్తే మాత్రం... ఎప్పుడు నిండుతుందో తెలియట్లేదు!!! ఎవరైనా మాయ చేసి, ప్రేమామృతం మెండుగా ఉండే సంజీవనీ పర్వతాలను తెచ్చి ఈ లోయలను పూరిస్తే... బాగుంటుంది చాలా!!! 

సంజీవనీ పర్వతాలను సాకారం చేసే మాయ మన మనసులోనే ఉంది మరి, So, Start Action.. Ready Steady Go Po... 
...మానస సంచారం/యోగ ధ్యానం OR భూసంచారం/Traveling... 

Time మాత్రం waste చేయకూడదు, అంతే!   

నా ప్రయాణం మొదలయ్యింది...