Saturday, July 31, 2010

1,81,81,818 వ సారి...మనిషి మళ్లీ ఓడిపోయాడు1,81,81,818 వ సారి మనిషి మళ్లీ ఓడిపోయాడు?!
2,50,500 ల నాటి మనిషి నిర్మాణము...
90,000 సంవత్సరముల నాటి మానవ సమాజ నిర్మాణము...
కనీసం 3000B.C ల నాటి ఆధునిక మనిషి జీవితంలో...
నాటి నుండీనేటి వరకూ
ప్రతి రోజూ మనిషి ఓడిపోతూనే ఉన్నాడు!
(3000B.C+2000A.D=1,81,81,818 రోజులు aprox )
....తన శరీరం నిర్ణయించిన అవసరాలనూ
తాను నిర్మించుకున్న సమాజ సంబంధాలనూ
సంభాలించుకోలేక సతమతమవుతున్నాడు మనిషి.
ఈ సమాజ నిర్మాణం...
ఎంతమంది తాత్వికులు తీర్చి దిద్దినా,
ఎంతమంది యోధులు చక్క దిద్దినా,
ఎంతమంది నిపుణులు నిగ్గుతెల్చినా,
ఎన్ని సార్లు మార్చినా...
ఎంతగా మారినా...
ఇప్పటికీ ఇంకా మనిషిని, తన పరీక్షలో తానే ఓడిపోయేలా చేస్తోంది.
సృష్టి ఎంత కష్టపడి మనిషి జీనోమును
తయారు చేసుకుని ఉంటుందో తెలుసా?
ఒక తల్లి ఎన్ని కష్టాలు పడి ఒక బిడ్డకు
జన్మను ఇచ్చి ఉంటుందో తెలుసా?
రోజుల తరబడి పుట్టీ పెరిగీ...
ఒక్కసారిగా మనిషి ఎందుకు చచ్చిపోవాలి ?
పుట్టినందుకు... బ్రతికినన్ని రోజులు బ్రతకడమేగా మనిషి జన్మ రహస్యం!
మరి ఈ లోగానే... చావు దేనికి పరిష్కారం?
... బ్రతకడానికి... బ్రతికి ఉన్న మనకెంత హక్కు ఉందో
అంతే బ్రతికే బాధ్యత ఉన్న ఓ మనిషి...
ఇవ్వాళ తనను తాను బలి తీసుకున్నాడంటే...
సమాజం అవసరాలు బలిదానాలేనా...
ఇన్ని కోట్ల సంవత్సరాల మనిషి ప్రయాణం...
ఏ అంతిమ లక్షాలకు? ఏ అన్తాలకూ?
...సొంత చేతులతో అంతం చేసుకుంటే తప్ప ఆ లక్ష్యాలు ఫలించవా?
...కోట్ల సంవత్సరాల భూమి జీవితంలో...
ఏ జీవీ , ఏ జన్తువూ గోడలు కట్టుకోదు
స్వార్థం కూడబెట్టుకోదు
ఉరి కొయ్యలు నాటుకోదు, ఉసురు తీసుకోదు

మనిషి మాత్రమే మరణ శాసనాన్ని ఎందుకు అనుసరిస్తాడు?
ఒక్క, మనిషికే ఎందుకింత...
ఆకలీ, ఆహారం
తోడూ, నీడా
అందరికీ ఒకటేనన్న అర్థం సత్యమైన రోజూ, మనం మనమవుతాం.
సత్యం అర్థం చేసుకోనన్ని రోజులూ...
మానవ సమాజం... ఒక వైపు కడుతుంటే మరో వైపు కూలిపోతున్న గోడ లాంటిదే!
మనీషి సంపాదించిన స్పిరిట్యువాలిటీలు సరిపోకపొతే
యానిమల్ స్పిరిట్స్ ని అద్దెకు తీసుకుని
కొత్తగా సిద్దాన్తాలు తిరగారాసుకుందాం

... బ్రతుకు ఉంటే ... శరిరంతోనో, మనసుతోనో
నీ చైతన్యంతో నీవు నీ సమాజానికి...
ఓ ఇటుకవో, ఇటుక సందులో కూరే సిమెంటువో
సిమెంటులో కలిపే ఇసుకరేణువో అవుతావు!
నువ్వే లేకపొతే నీకు ఏ సమాజమూ లేదు.
... సాధించే దాకా ... కొన , సాగించాలి...
ఈ రోజున నిన్ను నువ్వు ముగించుకున్నావు...
ఆంటే నీ లక్ష్యాలను ముగించావు!
పండ కుండా చెట్టు మీంచి... కాయలు రాలిపోతేనే భరించలేమే,
నీ నేలలో నీవు... మహా వృక్షం కాకుండానే కూలిపోతే...
పసిమోగ్గగానే వసి వాడిపోతే...
చిన్నబోయిన ముఖంతో మానవత్వం విలవిల్లాడుతోంది...
ఇషాన్... నువ్వు అనుకున్నది నెరవేర్చుకుని నువ్వు
గెలిచి వెళ్ళిపోయావు...
18,18,018 వ సారి సమాజం మనిషిని మళ్లీ ఓడించింది!

(సిస్టం ఫెయిలయింది... క్వొచ్చెన్మార్కుకూ, ఆశ్చర్యార్తకానికి ఉన్నట్లే,
'సిగ్గు చేటుకు' కూడా ఒక గుర్తుంటే బాగుండేది.)
హ్యూమన్ జీనోం మరొక బాధా తప్త గుర్తును గుండెల్లో దాచుకుంది!!

Sunday, July 25, 2010

making of movies

మేకింగ్ ఆఫ్ మూవీస్....... now a days...
ఇది పెద్ద మార్కెట్టింగ్ ఫార్ములా
అయిపొయింది.
వెనుకటికి,
బా ..గా హిట్ అయిన సినిమాల మేకింగ్ ప్రోగ్రామ్స్ టివీల్లో వచేవి.
ప్రతి ముక్కూతుమ్ముతోందిఇప్పుడు.
కొన్ని రోజులు పొతే, సినిమాతో పాటు
మేకింగ్ ఆఫ్ సినిమాను కూడా పార్లల్గారిలీజ్ చేస్తారు... కావచ్చు 
( 'డాన్ శ్రీను' మేకింగ్ ఆఫ్ మూవీ టివిలో వచ్చింది - బాగుంది .)

మేకింగ్ ఆఫ్ మూవీస్ బానే ఉంటాయి. 
ఎందుకంటే ...
తెరముందు విషయాల కన్నా తెర వెనుక విషయాలంటేనే... మనిషికి ఆసక్తి కనుక!...


Sunday, July 18, 2010

యుద్ధం జరిగేటప్పుడు


యుద్ధం జరిగేటప్పుడు నిద్రే రాదు
ఆదమరిస్తే అంతం ఆక్రమిస్తుంది...

...కళ్లు మూద్దామన్నా
రెప్పలు మూతబడవు
తాను బ్రతకాలని
కన్ను అనుకుంటుంది
నన్ను బ్రతికించుకోవాలని
నేను అనుకుంటాను
మాయల పకీరు ప్రాణాలు ...
ఏడేడు సముద్రాలవతల మఱ్ఱిచెట్టు తొర్రలో ఉన్న
రామచిలుకలో ఉన్నట్లు ,
నా మాయదారి ప్రాణాలు ...
ఎల్లలు లేని విశ్వం పుస్తకంపై , ఎడ తెగని రాతలు రాసే
నా పెన్నులో ఉన్నాయి.
ఈ యుద్ధం చెయ్యాలని
నేనెప్పుడూ  ఉవ్విళ్లూరుతూనే ఉంటాను
ఇక పరిస్థితులు చేయి దాటగానే
యుద్ధం మొదలవుతుంది ...
మొదలైతే నా చేతిలోనే
కానీ, ఇక చాలించడం దాని చేతుల్లోనే! 


జయించాలీ!... జయించాలీ!!
..జయించాలి... 
ఒక్కో ఆలోచననుజయిస్తూ రావాలి
ప్రతి ఆలోచనను లేగ దూడను చేసి
నా గాటన కట్టేయాలి.
ఆ పాడిపంటలతో కళకళ లాడుతూ
నా రాజ్యం సస్యశ్యామలం కావాలి.
ఈ స్వర్గంలో ఆడుకోవడానికి...
దివి నుంచి దేవతలు భువికి రావాలి! 


( అన్నమయ్యకు , త్యాగయ్యకు, క్షేత్రయ్యకు,
పోతనకు, రామదాసుకే కాదు, ప్రవీణకు కూడా...
... ఏలియన్స్ 
-దేవతలు- ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి తీరాలి మరి! ఉన్నారు కూడా!!) 


Sunday, July 11, 2010

నిన్ను నువ్వు


నిన్ను నువ్వు నమ్మితే
లోకం నిన్ను నమ్ముతుంది
నిన్ను నువ్వు తెలుసుకుంటే
లోకం నీకు తెలుస్తుంది
నిన్ను నువ్వు ప్రేమించుకుంటే
ఈ ప్రపంచాన్ని నువ్వు ప్రేమించగలవు
నిన్ను నువ్వు చదివితేనే
జనానికి నువ్వు పుస్తకమవుతావు
నన్ను నేను చదువుకుంటూ...
నా గ్రంధాన్ని సిద్ధం చేస్తున్నాను,
నువ్వైనా నేనైనా
నేను నువ్వైనా
నువ్వు నేనైనా...
మనల్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం...
తప్పి పోయిన గొర్రెకు
ఇంటి దారి తెలిసుండాలి!
మరుగుజ్జువో మఱ్ఱి చెట్టువో
నీ గురించి నువ్వే చూపగలవు
నీ విశ్వరూపం నీకే తెలిసుండాలి
ఆంజనేయునికి వానర గణం గుర్తు చేసినట్లు...
నీ బలాన్ని నీకు ప్రపంచం గుర్తు చెయ్యదు
ఎందుకంటే, ప్రపంచానికి నీతో పని లేదు
నీకే ప్రపంచంతో పని ఉంది
ఈ యుద్ధ రంగంలో నిన్ను నువ్వు గెలిస్తే
ప్రపంచాన్ని గెలుస్తావు


Sunday, July 4, 2010

కొత్తగా...


కొత్తగా ఈ ప్రపంచంలో
ఏదీ...పుట్టదు!
విశ్వ విస్ఫోటనాన్నీ
యుగాన్తాన్నీ...
గాలినీ, ధూళినీ
చెట్టును, పిట్టను
నిన్నూ, నన్నూ
కాలం మోసుకొస్తూ... ఉంటుంది.
మంచు కొండలను
సెలయేళ్ళు చేస్తుంది
ఉప్పు సముద్రాలను
మేఘాలుగా మార్చి కుమ్మరిస్తుంది
విత్తనాన్ని...
చెట్టు చేసి చూపిస్తుంది
పర్వతాలను
లోయలుగా పడగొడుతుంది
లోయలను
పర్వతాలుగా నిలబెడుతుంది
అమీబాను పుట్టిస్తుంది
మనిషిని సృష్టిస్తుంది!
భూమిని పిడికిట ముద్ద చేసి విసిరేస్తుంది
విశ్వ విపణిలో బొంగరంలా గింగిరాలు కొడుతున్నఆ భూమిని
ఖండ ఖండాలుగా విడగొడుతుంది...
కాలం కడుపులో
విశ్వమే విందు భోజనమవుతుంటే...
ఆ విస్తట్లో అప్పడం ముక్కలం కాని...మనమెంత?
అయినా మనల్ని...'ఎంతో' చేసి చూపించింది
అంతలోనే మళ్లీ ఆడేసుకుంటుంది
సంతోషాలను కష్టాలతో కబళిస్తుంది
ఆ కష్టాలను సుఖాలుగా అనువదిస్తుంది...
కాలం ప్రదర్శిస్తున్న ఈ మేళాలో
కొత్తగా మనం
కొనుక్కోవలసినవీ, కనుక్కొవలసినవీ ఏమీ లేవు,
చక్కర్లు కొడుతోన్న ఆ చక్రపు విస్తట్లోంచి...
మన వంతు మనం తీసుకోవడమే మన పని


Thursday, July 1, 2010

భూమ్మీద బాగుంది


ఆకలి, నిద్ర
బాధ, సుఖం
కోపం, ప్రేమ...
..ఏమీ చెయ్యలేని నిస్సహాయత ,
ఏదైనా చెయ్యగల తెగువ..

ఆకాశం, నేల 
ప్రేమ, విరహం 
పుట్టుక, చావు ...
..భూమ్మీద చాలా బాగుంది !
ఈ భూమ్మీద..
...పుట్టడమే సంతోషం!! 

విశ్వం భూమిని సృష్టించుకుంది
భూమ్మీద.. మనిషిని సృష్టించుకుంది

విశ్వానికి సంతోషం మనిషే !!!


( జూన్  24.. నా పుట్టిన రోజు...మరణం కంచె దాకా వెళ్లి... మళ్లీ బ్రతికాకా... భూమి మరింత ఆత్మీయమైన చోటు అనిపిస్తోంది!)