Sunday, November 14, 2010

నా ఆభరణాలు పోగొట్టుకుపోయాయి...!

నా ఆభరణాలు పోగొట్టుకుపోయాయి...!
ఇంట్లోంచి బయటకు, బయట నుంచీ ఇంట్లోకి...
అటు వెళ్లినా, ఇటు వెళ్లినా
ఎటూ వెళ్లక కుదురుగా కూచున్నా,
నా రెండు చేతులూ వెంట ఉంచుకున్నట్లు...
నా ఇద్దరు బుజ్జి తమ్ములను రెండో జత చేతులలా తగిలించుకు తిరిగేదాన్ని!

బడిలో తిన్నా, గుడిలో తిన్నా
వాళ్లు చేసిన తప్పులకు అమ్మ చేత నేను తన్నులు తిన్నా,
రైతు చద్ది మూటతో చేనుకెళ్లినట్లు...
ముద్దులొలికే బుజ్జి తమ్ములను
అన్నం ముద్దలతో పాటు అంటగట్టుకుని పొట్ట నింపుకునేదాన్ని!


ఊరు వెళ్లినా, ఊరేగింపుకు వెళ్లినా
ఇంట్లోనే మూలకు ముడుచుకు పడుకున్నా,
అవ్వా వాళ్లు బొడ్డు సంచిలో దుడ్లు దాచుకుని ఊరెళ్ళినట్లు...
చిట్టి తమ్ములను చిల్లర డబ్బులా పర్స్ లో పెట్టుకు తిరిగేదాన్ని!

భుమయినా, ఆకాశామయినా
సెలఏరయినా, చందమామయినా
అమ్మ గోరుముద్దలు తినిపించినట్లు...
అలగ కూడదని, అల్లరి తమ్ముళ్లకు ముందుగా చూపించి తర్వాత నేను చూసే దాన్ని!

చిత్తు కాగితం చదివినా, టి.వి లో మహా భారతం చూసినా
కవితలు రాసినా, కట్టు కథలు రాసినా
యుద్దానికి వెళ్లే వీరుడు కత్తి, డాలు పట్టుకున్నట్లు...
యుద్ధ ప్రాతిపదికన రాయడానికి వెళ్లేటప్పుడు...
ఒక చేత్తో పెన్ను, పేపర్... ఇంకో చేత్తో నా ఇద్దరూ తమ్ముళ్లనూ పదిలంగా పట్టుకుని, బుర్రకు పదునుపెట్టేదాన్ని! 

మేనత్త ఇంటికి వెళ్లినా, మేన మామ ఇంటికి వెళ్లినా
పెళ్లికి వెళ్లినా, పేరంటానికి వెళ్లినా
సినిమాకు వెళ్లినా, ఐస్ క్రీం పార్లర్ కు వెళ్లినా,
కొత్త కోడలు పుట్టింటి ఆభరణాలను అలంకరించుకుని, అత్తగారింటికి వెళ్లినట్లు...
నా ఇద్దరు బంగారు తమ్ములే నా నగలని ఒంట బెట్టుకుని, వెంట తీసుకు వెళ్లే దాన్ని!

అలా...
కర్ణుని కవచ, కుండలాల లాంటి నా ఆభరణాలు...
కొంచెం, కొంచెంగా పోగొట్టుకుపోయాయి!!!
కాలం సైతం కరిగించలేదనుకున్న ఆ లోహాలు...
వాటంతటవే... కరిగిపోయాయి.


పుట్టినప్పట్నించీ తియ్యక పెట్టుకున్న నగలు పోయేసరికి...
అవి ఒత్తిన గుర్తులతో... నా ముఖం బోసిపోయి ఉన్నాను! 


{అదండీ ... అలా ...నా ఆభరణాలు పోగొట్టుకుపోయాయి...
కనీసం పోగొట్టుకుపోయాయీ...అని అనుకుంటున్నాను!}
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

No comments:

Post a Comment