Saturday, December 31, 2011

A JOURNEY...in to d future


ఉత్సాహం...
కాలం కణాలను సరికొత్త క్షణాలుగా రగులుస్తుంది.
కదిలే ప్రతి క్షణాన్ని...ఉత్సవం చేస్తుంది.
జీవితంలో పిల్లల్లాంటి...
అబ్బురం ఉండాలి.
బాలానాం రోదనం బలం, ఆటా ఆనందం!
వేడెక్కించే వేదనను...
ఓ గంట ఏడ్చయినా పోగొట్టుకోవాలి.
ఉత్సవంలా ఉవ్విళ్ళురాలంటే...
జీవితమనే ఆటను అలవోకగా ఆడాలి,
జీవితాన్ని అలవోకైన ఆటగా..ఆడాలి!

వర్షం కురుస్తున్న మబ్బుల్ని చీల్చుకుని..
సూర్యుడు తొంగి చుస్తే..అదే ఓ అబ్బురం.
అదే ఎండ మల, మల మాడుస్తున్నప్పుడు..
కాకి రెక్కంత మేఘం కనిపించడమే..కమనీయం.
చిక్కటి చలిలో..
మిల, మిల మెరిసే నక్షత్రాలే వెచ్చని ఉత్సాహం.
మొగ్గ పువ్వై వికసించడమే.. పరమాద్భుతం.
బోసి నవ్వులు చూడగలగటమే.. పరమానందం.
ఆడ పిల్ల మోమున కమ్మిన కురుల వీక్షణమే సౌందర్య ఆరాధనం.
గడ్డి పుల్ల, గుడ్డి కుక్కా
చెత్త దిబ్బ, నీటి చేప, నింగి చుక్కా..
విశ్వపు కణ, కణంలో
క్షణ, క్షణంలో 
కొత్తదనం ఉవ్విల్లూరిస్తుంది..,
ప్రతి క్షణం..మార్పుతో పరవళ్లు తొక్కుతూ ఉంటుంది.

ప్రకృతంటేనే మార్పు..
సృష్టంటేనే మార్పు..
చరిత్రంటేనే   మార్పు..
మనిషంటేనే.. మార్పు
మార్పు, మార్పు, మార్పు..
జీవితమంటేనే... మార్పు!..
అది మనిషిదైనా, మట్టిదైనా
ఇంటిదైనా, మింటిదైనా!
గడచిన క్షణంతో సరిపెడితే
మరు క్షణానికి రూపమే ఉండదు.
పిల్లాడు పెద్దైతే...
వయసు మొదలవుతుంది...
అదింకా పెరుగుతూనే ఉంటుంది...
అంతర్గత మార్పుల వైపు మనసు అనే కొత్త సచలిత రూపం వైపు.
మనసు..ఒక్కో మెట్టూ ఎక్కుతూనే ఉంటుంది...
గర్భ గుడి చేరుతుందా మార్గం.
కానీ, పూజ అప్పుడే మొదలవుతుంది..

ఆశ, ఆనందం 
సుఖం, సంతోషం 
త్యాగం, దుఃఖం 
కామం, తృప్తి 
ధనం, ఆనందం..
ఎప్పుడూ, ఎక్కడా మనిషికి.. ఇది,
చాలనిపించదు.., ఇక్కడ ఆగుదామనిపించదు 
నడవడానికి నేల అందుతూనే ఉంటుంది..
మెట్టుపై ఇంకో మెట్టూ
గుట్ట పై ఇంకో గట్టు 
గుట్ట మీద చెట్టు పెరుగుతూనే ఉంటుంది 
చెట్టు మీదుండే గువ్వా పెరుగుతూనే ఉంటుంది
గువ్వ గుండెల్లో ప్రేమా పెరుగుతూనే ఉంటుంది...
చెట్టు పెరగడం ఆగినా, ఆ ప్రేమ పెరగడం ఆగినా 
వాటి చెలిమికి విలువ లేదు,
వాటి ఉనికికి ఊపిరి లేదు, 
అవి నిన్నటి పాత కథలవుతాయి.
మారక పొతే.. శిలలనైనా శిధిలాలంటారు.
పెరగక పొతే చెట్టునైనా ఒట్టి కట్టే అంటారు!

ఆశ్చర్యం పోయాక 
అది ఉత్సవం కాలేదు.
అబ్బురం కానప్పుడు 
అది ఉత్సాహం ఇవ్వదు.
కానీ, కాలం..
కాలమే ఒక ఉత్సవం
కాలమే ఒక ఉత్సాహం
కాలమే ఒక స్వకీయ ప్రవాహం
అది మారుతూ ఉంటుంది,
అనంతాల హద్దుల వైపుకు..
పెరుగుతూ ఉంటుంది,
నిన్ను కూడా మారుస్తూ ఉంటుంది...
నీ ఆశ లాగా.., నీ శ్వాస లాగా
నీ కాంక్ష లాగా.., మరిగే నీ మనసు లాగా
నీ ప్రేమ లాగా.., నీ లోని సుఖ లాలస లాగా
నీ ఆనంద ఆకాంక్ష లాగా.., ఎంతకీ శాంతించని నీ అహం లాగా
నువ్ తల్లడిల్లే శాంతి కాముకత లాగా.., నువ్ విరాగించే మోక్ష సాధన లాగా
.. నువ్వు మారుతూనే ఉంటావు..,
కొత్త ఎత్తుల కొలతలకు.. ఎదుగుతూనే ఉంటావు..
ఏ క్షణంలో నీవు మారటం మానేశావో...
ఆ క్షణంలో నీవు...
ఆ క్షణం లోనే నీవు మరణించావు!
Anything that does not grow..
                    ..eventually DIE!
So, Allow yourself to grow,
Happiness is... in the JOURNEY!!

No comments:

Post a Comment