Monday, December 19, 2011

భూమ్మీద ఉండాలంటే...


భూమి నా ఇల్లు...
భూమ్మీద ఉండే జీవ, నిర్జీవజాలాలన్నీ...
నా సహ కుటుంబీకులు.
నాలో ఏ తేడా లేదు,
వారిలోనూ ఏ తేడా లేదు,
నాకూ, వారికీ మధ్యా...కూడా ఏ తేడా లేదు.
నేనంటే...నా ఒళ్లు కాదు...
నేనంటే నా ఇల్లు.
నాకు జన్మనివ్వడానికే నా భూమి పుట్టింది...
నా కోసం.. 
ముందే ఒక విశాల వసతి గృహాన్ని,
మందీ, మార్బలాలనూ సమకూర్చి పెట్టింది.
తన లాగా నన్నూ
ఓ కుటుంబానికి కానుకను చేసింది.
నా కుటుంబానికి...
నేను, ఉపయోగ పడుతున్నానా?
ఉత్సవాన్నవుతున్నానా?
అంతు లేని ఆనందాలను ఉత్పత్తి చేస్తున్నానా?
సహ జీవన సామరస్యాన్ని పంపకం చేస్తున్నానా?
..............

భూమి కుటుంబంలో 
ఏ ఒడిదుడుకులూ లేవు
ఏ అపశ్రుతులూ ఉండవ్
ఏ  అపసవ్యతలూ జరగవ్...
అన్నీ ఏర్పరచబడిన కక్షల్లోనే 
కట్టుబడి కదుల్తుంటాయి.
మరి, నా కుటుంబంలో...?
అన్నీ అవకతవకలే.
ఎవరి ఆకలి చావు సమాధి మీదో 
ఎవరి పాలరాతి మందిరమో 
కట్టబడి ఉంటుంది.
ఎవరి చిరిగిన చీలికల పేలికలతోనో..
ఎవరి  పట్టు బట్టలో 
నేత పడుతూ ఉంటాయి.
ఎవరి చెమట బిందువుల తళ, తళల తోనో..
ఎవరి  బంగారపు ఆభరణాలు 
ముత్యాలద్దుకున్టుంటాయి.
ఎవరి  అజ్ఞానపు, అమాయకపు రీతులో 
ఎవరి ఆధిపత్య, అభిజాతాలకు 
ఆజ్య భోజ్యమవుతుంటాయి.
కాని...,
హక్కుంది...
వారికీ అధికారముంది
ఈ ఇంటి వంట తిని కడుపు నింపుకునే హక్కు,
ఇంట్లో  అందరికీ ఉంది.
ఒకరికి కొంచెం ఎక్కువ, ఒకరికి కొంచెం తక్కువ, ఒకరికి అస్సలు తక్కువ...
...ఇదొక తప్పుడు పంపకం.
ఇంటి ఇనప్పెట్టె పై అందరికీ అధికారముంది 
కొన్ని చేతులకే తాళాలు 
తప్పుడు తెంపరితనం.
ఎండా, వానా,
కష్టం, సుఖం
బాధా, సంతోషం 
ఆనందం హరివిల్లుని అందుకునే అవకాశం అందరిదీ.
నా ఇంటిని ముక్కలు చేసీ,
హక్కులూ, అధికారాలనీ
సమాజం, సౌలభ్యం అని...
ఇంటిల్లిపాదీ కూడబలుక్కుని గతి తప్పినా
తప్పుడు  కక్షలో పరిభ్రమణం
పరిపూర్ణ జీవనం కానేరదు,
కాకూడదు..!
* తిండి, గుడ్డ, గూడులకు భిక్షమెత్తేది.. 
వారి నిర్వీర్యత కాదు.
అది మనం చేసే మోసం.
నిలువెత్తు మోసం.
మనిషి తనను తాను చేసుకునే...మోసం.
దగా పెడుతున్న నువ్వే, దగా పడుతున్న వాడివి కూడ..!

నీది, నాది, వారిది...ఒకే ఇల్లు, 
మన ఇంటి బిడ్డను జోలె పట్టించే దౌర్భాగ్యం మనది.
పిడికెడు అన్నమైనా, పట్టెడు బట్టైనా...
దానం ఇవ్వట్లేదు నువ్వు, 
చేసిన తప్పును కప్పి పుచ్చుకుంటున్నావ్...
దానంగా కాదు, వారికి పొందే హక్కుంది.
మితి మీరిన నీ అపసవ్యతల వల్ల
వీధిన పడుతోన్నది..,
భిక్షమెత్తుతున్నదీ..,
దొంగతనం, వ్యభిచారాది జూద మర్యాదలను 
ముసుగేసుకుంటున్నది...
వారు..ఎవరో కాదు,
నీ కుటుంబం..!
నీ ఇల్లే నీ స్వర్గం.
దాన్ని నరక కూపం చేసుకున్నది.. ఇక చాలు.
ఒక్క సారి ఈ ఇల్లు కూలిందంటే...
కాలి కింద భూమి కరిగిందంటే...
ఎవ్వరవు నీవు?..,
ఈ విశాల, విశ్వ వీధులలో.
చిన్న పిల్లాడవు కూడా కాదు,
తెలిసో, తెలీకో తప్పిపోయావనుకోటానికి...
ఓ మనిషీ తెలిసి, తెలిసి..
ఎందుకు, తప్పిపోయేన్దుకే 
తప్పుడు దారులు వెదుక్కున్టావ్?
సొంత ఇంటినీ, సొంత వారినీ 
మించిన వైభవం లేదు జగతి ప్రగతిలో.
సకల సౌభాగ్యాలతో విలసిల్లే.. 
భూమి మన ఇల్లు.
కాని..,
భూమ్మీద ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి...

{{ L. V. Prasad కంటి ఆసుపత్రికి చికిత్సకు వచ్చిన ఒక నిరుపేద స్త్రీ...
  మా టెర్రస్ పక్కనే ఉండే ...ఆసుపత్రి వాళ్లకు మాత్రమే అద్దెకు ఇచ్చే ఒక బిల్డింగ్ లో 4 రోజులు అద్దెకు 
  దిగింది. వాళ్ల గదికి ఎదురుగుండా టెర్రస్ పై రోజూ నేను బట్టలు ఆరేస్తున్నాను...ప్రతి రోజూ ఆమె దిగాలుగా వాటి వైపు చూస్తూ ఉండటం నేను window లోంచి గమనించాను. సడెన్ గా ఒక రోజావిడ పిట్ట గోడ దూకి ఇవతలకు వచ్చింది.., ఆరబెట్టిన బట్టల్లోంచి కొన్ని తీసుకోవడానికి సిద్దపడుతూ...చుట్టూ చూస్తోంది. నేను sound చేయకుండా ఆమె తీసుకోవడానికి నా వంతు సహకారం అందించాను.
తీద్దామా,   వద్దా 
తీద్దామా, వద్దా...
- త్వరగా తీయ్ - ..నేను
తీగ పట్టుకుంటుంది...
వదిలేస్తుంది...
- తీసుకో -
- నీకేం కావాలో తీసుకో తల్లీ - .. నేను
ఆమె తీసుకో లేదు,
పిట్ట గోడ దూకి వెళ్లిపోయింది.
ప్చ్.., నేనేమైనా శబ్ధం చేశానా?
నా ఊపిరి కూడా బిగపట్టి ఉన్నానే..
నీకు ఆ మాత్రం సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు లేదా??
మరుసటి రోజూ ఆమెను దృష్టిలో ఉంచుకుని మరిన్ని బట్టలారవేశాను...
ఆమె చిన్న పాపను గుర్తుంచుకుని మరీ పిల్లల దుస్తులు కూడా వేశాను...
ఆమె రాలేదు...
ఇంకో రోజు...
చూస్తుందే గాని, రాలేదు.
నేనే అడిగి ఇద్దామనుకున్నాను...
కాని, ఆ అభిమానవతి ఆత్మాభిమానాన్ని 
నా దాన ప్రతిభతో అవమానించడం తగదని ఊరకున్నాను.
ఆ తర్వాత నా హడావిడిలో నేను బిజీ అయిపోయాను..
వాళ్లు ఆపరేషన్ అయిపోయి వెళ్లిపోయారు.
సడెన్ గా ఓ రోజు చూసుకుంటే...
నా ఇన్నర్స్ రెండు మిస్ అయ్యాయి...
సడెన్ గా ' ఆమె' గుర్తొచ్చింది.
అంటే, ఆమె, వాటి కోసమా?
ఒక స్త్రీ, సాటి స్త్రీ, తన స్త్రీత్వాన్ని కప్పి ఉంచుకోడానికి...
కన్నీళ్లాగలేదు,,,,,,
...గుండెల్లో ఎవరో కెలికినట్లవుతోంది...
సాటి మనుష్యులకు సేవ చేసుకోవడం, 
బాధ్యత కాదు భాగ్యం. 
సేవే మహద్భాగ్యం 
... అని గురువులు చెప్పిన మాటలు...
అర్థమయ్యాయి..!

ఇంత ఆధునికమైనప్పటికీ
సమ కాలీన సమాజంలోని,
కొన్ని విషయాల గురించి..
రాయడానికి కూడా.. ఎంతో ధైర్యం కావలసి వస్తోంది.
..., భూమి మన ఇల్లే, కాని 
భూమ్మీద ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి..,
అన్నం కోసం ఒకడు దొంగ అవుతున్నాడు...
పొట్టకూటి కోసం ఒక స్త్రీ వ్యభిచారవుతోంది...
అదుపులేని స్వేచ్ఛతో ఒక పురుషుడు 
ఆ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు...
అధికారం కోసం కొందరు మనుష్యులు పశువులవుతున్నారు...
ధన దాహంతో ఎందరో దోపిడీదారులవుతున్నారు...
కండ బలంతో కొందరు
యుద్ధాలకు కారణమవుతున్నారు...
తెంపరితనంతో కొందరు 
విజ్ఞానులమని విర్రవీగుతున్నారు...
అమాయకత్వంతో కొందరు 
కొడిగట్టి పోతున్నారు...
అబలత్వంతో కొందరు 
అత్యాచారాలకు గురి అవుతున్నారు...
అంతరిక్షంలో విహారాల కోసం కొందరు
రంగుల కలలు కంటున్నారు...
కురుపులుగట్టిన రోగాలతో కొందరు
గుడి మెట్ల కింద చేతులు చాస్తున్నారు...
సహజ వాంఛలు తీరని కొందరు 
తిరుగుబోతులవుతున్నారు...
సహజ రసాయన ప్రేరితులై,
దొంగ చాటుగా సమాజం గోడలను దాటే ఎందరినో చూశాను...
నా ఉనికిని రహష్య పరుస్తూ 
వారి ఉదంతాన్ని అరహష్య పరచకుండా..
నా వంతు సేవను నేను చేస్తూనే ఉన్నాను.
సంపద విషయంలో, 
సంస్కృతి విషయంలో,
జీవ-భౌతిక-రసాయనిక..
సహజ వాంఛల విషయంలో,
సమాజంలోని పద్దతులను..
మార్చండి..మార్చి తీరండి! 
ఆకలి, నిద్ర, సుఖాల కోసం
అంతులేని అంతిమ ఆనందాల కోసం...
ప్రతి మనిషి అన్వేషణ, ప్రయాణాలు 
కొనసాగుతున్నాయి...
..., భూమి మన ఇల్లే, కాని 
భూమ్మీద ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి..,
...అర్హత సాధించే ప్రయత్నంలో...నేను..........}} 

No comments:

Post a Comment