Saturday, December 31, 2011

A JOURNEY...in to d future


ఉత్సాహం...
కాలం కణాలను సరికొత్త క్షణాలుగా రగులుస్తుంది.
కదిలే ప్రతి క్షణాన్ని...ఉత్సవం చేస్తుంది.
జీవితంలో పిల్లల్లాంటి...
అబ్బురం ఉండాలి.
బాలానాం రోదనం బలం, ఆటా ఆనందం!
వేడెక్కించే వేదనను...
ఓ గంట ఏడ్చయినా పోగొట్టుకోవాలి.
ఉత్సవంలా ఉవ్విళ్ళురాలంటే...
జీవితమనే ఆటను అలవోకగా ఆడాలి,
జీవితాన్ని అలవోకైన ఆటగా..ఆడాలి!

వర్షం కురుస్తున్న మబ్బుల్ని చీల్చుకుని..
సూర్యుడు తొంగి చుస్తే..అదే ఓ అబ్బురం.
అదే ఎండ మల, మల మాడుస్తున్నప్పుడు..
కాకి రెక్కంత మేఘం కనిపించడమే..కమనీయం.
చిక్కటి చలిలో..
మిల, మిల మెరిసే నక్షత్రాలే వెచ్చని ఉత్సాహం.
మొగ్గ పువ్వై వికసించడమే.. పరమాద్భుతం.
బోసి నవ్వులు చూడగలగటమే.. పరమానందం.
ఆడ పిల్ల మోమున కమ్మిన కురుల వీక్షణమే సౌందర్య ఆరాధనం.
గడ్డి పుల్ల, గుడ్డి కుక్కా
చెత్త దిబ్బ, నీటి చేప, నింగి చుక్కా..
విశ్వపు కణ, కణంలో
క్షణ, క్షణంలో 
కొత్తదనం ఉవ్విల్లూరిస్తుంది..,
ప్రతి క్షణం..మార్పుతో పరవళ్లు తొక్కుతూ ఉంటుంది.

ప్రకృతంటేనే మార్పు..
సృష్టంటేనే మార్పు..
చరిత్రంటేనే   మార్పు..
మనిషంటేనే.. మార్పు
మార్పు, మార్పు, మార్పు..
జీవితమంటేనే... మార్పు!..
అది మనిషిదైనా, మట్టిదైనా
ఇంటిదైనా, మింటిదైనా!
గడచిన క్షణంతో సరిపెడితే
మరు క్షణానికి రూపమే ఉండదు.
పిల్లాడు పెద్దైతే...
వయసు మొదలవుతుంది...
అదింకా పెరుగుతూనే ఉంటుంది...
అంతర్గత మార్పుల వైపు మనసు అనే కొత్త సచలిత రూపం వైపు.
మనసు..ఒక్కో మెట్టూ ఎక్కుతూనే ఉంటుంది...
గర్భ గుడి చేరుతుందా మార్గం.
కానీ, పూజ అప్పుడే మొదలవుతుంది..

ఆశ, ఆనందం 
సుఖం, సంతోషం 
త్యాగం, దుఃఖం 
కామం, తృప్తి 
ధనం, ఆనందం..
ఎప్పుడూ, ఎక్కడా మనిషికి.. ఇది,
చాలనిపించదు.., ఇక్కడ ఆగుదామనిపించదు 
నడవడానికి నేల అందుతూనే ఉంటుంది..
మెట్టుపై ఇంకో మెట్టూ
గుట్ట పై ఇంకో గట్టు 
గుట్ట మీద చెట్టు పెరుగుతూనే ఉంటుంది 
చెట్టు మీదుండే గువ్వా పెరుగుతూనే ఉంటుంది
గువ్వ గుండెల్లో ప్రేమా పెరుగుతూనే ఉంటుంది...
చెట్టు పెరగడం ఆగినా, ఆ ప్రేమ పెరగడం ఆగినా 
వాటి చెలిమికి విలువ లేదు,
వాటి ఉనికికి ఊపిరి లేదు, 
అవి నిన్నటి పాత కథలవుతాయి.
మారక పొతే.. శిలలనైనా శిధిలాలంటారు.
పెరగక పొతే చెట్టునైనా ఒట్టి కట్టే అంటారు!

ఆశ్చర్యం పోయాక 
అది ఉత్సవం కాలేదు.
అబ్బురం కానప్పుడు 
అది ఉత్సాహం ఇవ్వదు.
కానీ, కాలం..
కాలమే ఒక ఉత్సవం
కాలమే ఒక ఉత్సాహం
కాలమే ఒక స్వకీయ ప్రవాహం
అది మారుతూ ఉంటుంది,
అనంతాల హద్దుల వైపుకు..
పెరుగుతూ ఉంటుంది,
నిన్ను కూడా మారుస్తూ ఉంటుంది...
నీ ఆశ లాగా.., నీ శ్వాస లాగా
నీ కాంక్ష లాగా.., మరిగే నీ మనసు లాగా
నీ ప్రేమ లాగా.., నీ లోని సుఖ లాలస లాగా
నీ ఆనంద ఆకాంక్ష లాగా.., ఎంతకీ శాంతించని నీ అహం లాగా
నువ్ తల్లడిల్లే శాంతి కాముకత లాగా.., నువ్ విరాగించే మోక్ష సాధన లాగా
.. నువ్వు మారుతూనే ఉంటావు..,
కొత్త ఎత్తుల కొలతలకు.. ఎదుగుతూనే ఉంటావు..
ఏ క్షణంలో నీవు మారటం మానేశావో...
ఆ క్షణంలో నీవు...
ఆ క్షణం లోనే నీవు మరణించావు!
Anything that does not grow..
                    ..eventually DIE!
So, Allow yourself to grow,
Happiness is... in the JOURNEY!!

Friday, December 23, 2011

నాది ఈ ప్రపంచం.., కాదేమో!


నాది ఈ ప్రపంచం...
.., కాదేమో!..., ఏమో అలా అని,
అనిపిస్తోంది ఎన్నో సార్లు.
ఏం అనుకున్నా, ఎంత అనుకున్నా...
అనుకున్నది.., చేసే అర్హత ప్రతి ప్రతీకాత్మకూ...ఉంది.
అందుకే,
నా ఊహలు ఈ భూమ్మీద కాలు మోపలేనప్పుడు..
నా కలలను ఈ ప్రపంచం అంగీకరించటం లేదని,
మరో ప్రపంచానికి వలస పోతూ ఉంటాను..!
ఆ మరో సుర ప్రపంచంలో
యక్షిణిలా విశ్వ గవాక్షాలను తొంగి చూశాను.
ఖగోళ తబలల లయ, విన్యాసాలను వింటూ
గంధర్వ గానాలను ఆలపించాను.
దేవ కన్యలా నక్షత్ర ఉద్యాన వనాలలో
సుదూర వింత గ్రహాలను చెలికత్తెలుగా చేసుకుని
మధుపమై మృదు, మధుర విహారాలు చేశాను.
యే వృద్ధ నక్షత్ర వృక్షం నుండీ
యే పండుటాకులు పట, పటమనిరాలాయో గాని..,
సీతాకోక చిలుక.. లా నేను కంటున్న కల
కళ్లు తెరిచేలోగా కరిగిపోయింది..!
మళ్లీ నిద్ర పోవాలంటే..
భయంగా ఉంది...
గురుత్వాకర్షణ లేక వేళ్లాడుకుని ఉన్న శూన్య శ్మశానాలలో
నా కలలను పూడ్చి పెట్టిన సమాధుల దారుల గుండా
ఎక్కడ నడవాల్సి ఒస్తుందో..
అని నా మనసు వ్యధ చెందుతోంది.

అంతలోనే గుర్తొస్తోంది...
నా మది ఎగురేసిన కలలు
రెక్కలార్చుకుంటూ క్రొంగొత్త లోకాలకు ఎగరటం చూసి ఉన్నానని.
పువ్వులై, పువ్ రెక్కలై
చిలకలై, వెలుతురు తునకలై
అవి ఎగిరే సౌరభ సౌందర్యాలు
నా కనుల ముందు గుభాలిస్తుంటే..
మనసు మరుమల్లెల తోటలా విరబూస్తోంది.
నేనెప్పుడూ ఆ తోటలోనే కదా విహారాలు చేస్తానని,
మనసు ఆ హుషారుతో ఉవ్విల్లూరుతుంది...

కలలు, కలలు...ఎన్నో కలలు...
రెప్పలు మూసిన చోట
మూటలుగా కట్టి ఉన్నాయి.
మూసిన రెప్పల మాటున మాటు వేసి ఉన్నాయి.
లోపలికి..లో లోపలికి...ఆ తలుపులు కాస్త తెరుచుకోవటం కోసం
అవి కలలు కంటున్నాయి...

నేనో పువ్వునంటాయి
అంతలోనే గువ్వనంటాయి
అణువణువునీ మిణుగురు కణికలను చేసీ
ఆకాశంలో వెదజల్లుతాయి..
మంచు శిఖరాలపై లేత కిరణాలను
నా చేతులతో అలంకరింపజేస్తాయి..
మైదానాలను మేలిముసుగులు చేసి
పర్వత పాదాల దగ్గర కూచో పెట్టి సారె పెడతాయి..
వర్షపు చినుకుల తాళ్లను పట్టుకుని
ఊగిన ఉయ్యాలలు...
వెన్నెల వాగులో
కలువ చెలులతో ఆడిన సయ్యాటలు..
జ్ఞాపకాలన్నిటినీ దంతపు సింహాసనాలపై ఉంచి,
ఏనుగులతో చేయించిన అంబారీ సవారీలు..
చందమామ ఇంట్లో ఆడుకున్న
అందాల రాకుమారీ - కత్తి యుద్ధం క్రీడలు..
మబ్బుల పరదాల మాటున
ఊహా సుందరునితో ఆడుకున్న దోబూచులాటలు..
సూర్య దేవుని అశ్వాన్ని దొంగిలించి,
పాల పుంతల మధ్య నుంచి దౌడు తీయించిన
జంట గుర్రపు స్వారీలు..
అడ్డు వచ్చిన అంతరిక్ష నౌకలను ఆట బొమ్మలుగా
తోలుసంచిలో దాచుకున్న సంబరాలు..
రివ్వున భూమ్మీదకు దూసుకు వచ్చి...
హిమాలయ శిఖరాన్ని తాకి అంతరిక్షంలోకి
గిరికీలు కొట్టినప్పుడు పొందిన ఆనందం...
...అంతలోనే...

...అంతలోనే...
హిమ జలపు స్పర్శ తగిలి,
ప్రవరాఖ్యుని పాదాలకు పూసిన పసరు కరిగినట్లు..
కలల రెక్కలనెవరో...
కత్తిరించిన బరువైన సూచన.
బరువెక్కిన ఆ కళ్ల కైపు...ఒంటి దాకా పాకింది..
- దోసెలకు పిండి రుబ్బమని అమ్మ వేసిన కేక చెవులకు సోకింది -
ఇంకేం చేస్తాం??
నీలి పచ్చని ఉప్పుప్పని నీళ్లలో
గులాబి రంగు జల కన్యనై విహరించాలనే
తియ, తియ్యని కలను..,
రేపటికి వాయిదా వేసుకుని,
గొంగళి పురుగులా నా బద్దకపు జీవన ప్రయాణానికి బయల్దేరాను..
ఇంకా వదలని ఊహల రెక్కల ఉనికి స్పర్శ,
నా బాహువుల బరువు కన్నా కాస్త ఎక్కువగా,
లీలగా, సుతి మెత్తగా, గమ్మత్తుగా, ఎంతో మత్తుగా నన్ను
మరో లోకాలకు మళ్లీ, మళ్లీ పిలుస్తూనే ఉంది...

Monday, December 19, 2011

భూమ్మీద ఉండాలంటే...


భూమి నా ఇల్లు...
భూమ్మీద ఉండే జీవ, నిర్జీవజాలాలన్నీ...
నా సహ కుటుంబీకులు.
నాలో ఏ తేడా లేదు,
వారిలోనూ ఏ తేడా లేదు,
నాకూ, వారికీ మధ్యా...కూడా ఏ తేడా లేదు.
నేనంటే...నా ఒళ్లు కాదు...
నేనంటే నా ఇల్లు.
నాకు జన్మనివ్వడానికే నా భూమి పుట్టింది...
నా కోసం.. 
ముందే ఒక విశాల వసతి గృహాన్ని,
మందీ, మార్బలాలనూ సమకూర్చి పెట్టింది.
తన లాగా నన్నూ
ఓ కుటుంబానికి కానుకను చేసింది.
నా కుటుంబానికి...
నేను, ఉపయోగ పడుతున్నానా?
ఉత్సవాన్నవుతున్నానా?
అంతు లేని ఆనందాలను ఉత్పత్తి చేస్తున్నానా?
సహ జీవన సామరస్యాన్ని పంపకం చేస్తున్నానా?
..............

భూమి కుటుంబంలో 
ఏ ఒడిదుడుకులూ లేవు
ఏ అపశ్రుతులూ ఉండవ్
ఏ  అపసవ్యతలూ జరగవ్...
అన్నీ ఏర్పరచబడిన కక్షల్లోనే 
కట్టుబడి కదుల్తుంటాయి.
మరి, నా కుటుంబంలో...?
అన్నీ అవకతవకలే.
ఎవరి ఆకలి చావు సమాధి మీదో 
ఎవరి పాలరాతి మందిరమో 
కట్టబడి ఉంటుంది.
ఎవరి చిరిగిన చీలికల పేలికలతోనో..
ఎవరి  పట్టు బట్టలో 
నేత పడుతూ ఉంటాయి.
ఎవరి చెమట బిందువుల తళ, తళల తోనో..
ఎవరి  బంగారపు ఆభరణాలు 
ముత్యాలద్దుకున్టుంటాయి.
ఎవరి  అజ్ఞానపు, అమాయకపు రీతులో 
ఎవరి ఆధిపత్య, అభిజాతాలకు 
ఆజ్య భోజ్యమవుతుంటాయి.
కాని...,
హక్కుంది...
వారికీ అధికారముంది
ఈ ఇంటి వంట తిని కడుపు నింపుకునే హక్కు,
ఇంట్లో  అందరికీ ఉంది.
ఒకరికి కొంచెం ఎక్కువ, ఒకరికి కొంచెం తక్కువ, ఒకరికి అస్సలు తక్కువ...
...ఇదొక తప్పుడు పంపకం.
ఇంటి ఇనప్పెట్టె పై అందరికీ అధికారముంది 
కొన్ని చేతులకే తాళాలు 
తప్పుడు తెంపరితనం.
ఎండా, వానా,
కష్టం, సుఖం
బాధా, సంతోషం 
ఆనందం హరివిల్లుని అందుకునే అవకాశం అందరిదీ.
నా ఇంటిని ముక్కలు చేసీ,
హక్కులూ, అధికారాలనీ
సమాజం, సౌలభ్యం అని...
ఇంటిల్లిపాదీ కూడబలుక్కుని గతి తప్పినా
తప్పుడు  కక్షలో పరిభ్రమణం
పరిపూర్ణ జీవనం కానేరదు,
కాకూడదు..!
* తిండి, గుడ్డ, గూడులకు భిక్షమెత్తేది.. 
వారి నిర్వీర్యత కాదు.
అది మనం చేసే మోసం.
నిలువెత్తు మోసం.
మనిషి తనను తాను చేసుకునే...మోసం.
దగా పెడుతున్న నువ్వే, దగా పడుతున్న వాడివి కూడ..!

నీది, నాది, వారిది...ఒకే ఇల్లు, 
మన ఇంటి బిడ్డను జోలె పట్టించే దౌర్భాగ్యం మనది.
పిడికెడు అన్నమైనా, పట్టెడు బట్టైనా...
దానం ఇవ్వట్లేదు నువ్వు, 
చేసిన తప్పును కప్పి పుచ్చుకుంటున్నావ్...
దానంగా కాదు, వారికి పొందే హక్కుంది.
మితి మీరిన నీ అపసవ్యతల వల్ల
వీధిన పడుతోన్నది..,
భిక్షమెత్తుతున్నదీ..,
దొంగతనం, వ్యభిచారాది జూద మర్యాదలను 
ముసుగేసుకుంటున్నది...
వారు..ఎవరో కాదు,
నీ కుటుంబం..!
నీ ఇల్లే నీ స్వర్గం.
దాన్ని నరక కూపం చేసుకున్నది.. ఇక చాలు.
ఒక్క సారి ఈ ఇల్లు కూలిందంటే...
కాలి కింద భూమి కరిగిందంటే...
ఎవ్వరవు నీవు?..,
ఈ విశాల, విశ్వ వీధులలో.
చిన్న పిల్లాడవు కూడా కాదు,
తెలిసో, తెలీకో తప్పిపోయావనుకోటానికి...
ఓ మనిషీ తెలిసి, తెలిసి..
ఎందుకు, తప్పిపోయేన్దుకే 
తప్పుడు దారులు వెదుక్కున్టావ్?
సొంత ఇంటినీ, సొంత వారినీ 
మించిన వైభవం లేదు జగతి ప్రగతిలో.
సకల సౌభాగ్యాలతో విలసిల్లే.. 
భూమి మన ఇల్లు.
కాని..,
భూమ్మీద ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి...

{{ L. V. Prasad కంటి ఆసుపత్రికి చికిత్సకు వచ్చిన ఒక నిరుపేద స్త్రీ...
  మా టెర్రస్ పక్కనే ఉండే ...ఆసుపత్రి వాళ్లకు మాత్రమే అద్దెకు ఇచ్చే ఒక బిల్డింగ్ లో 4 రోజులు అద్దెకు 
  దిగింది. వాళ్ల గదికి ఎదురుగుండా టెర్రస్ పై రోజూ నేను బట్టలు ఆరేస్తున్నాను...ప్రతి రోజూ ఆమె దిగాలుగా వాటి వైపు చూస్తూ ఉండటం నేను window లోంచి గమనించాను. సడెన్ గా ఒక రోజావిడ పిట్ట గోడ దూకి ఇవతలకు వచ్చింది.., ఆరబెట్టిన బట్టల్లోంచి కొన్ని తీసుకోవడానికి సిద్దపడుతూ...చుట్టూ చూస్తోంది. నేను sound చేయకుండా ఆమె తీసుకోవడానికి నా వంతు సహకారం అందించాను.
తీద్దామా,   వద్దా 
తీద్దామా, వద్దా...
- త్వరగా తీయ్ - ..నేను
తీగ పట్టుకుంటుంది...
వదిలేస్తుంది...
- తీసుకో -
- నీకేం కావాలో తీసుకో తల్లీ - .. నేను
ఆమె తీసుకో లేదు,
పిట్ట గోడ దూకి వెళ్లిపోయింది.
ప్చ్.., నేనేమైనా శబ్ధం చేశానా?
నా ఊపిరి కూడా బిగపట్టి ఉన్నానే..
నీకు ఆ మాత్రం సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు లేదా??
మరుసటి రోజూ ఆమెను దృష్టిలో ఉంచుకుని మరిన్ని బట్టలారవేశాను...
ఆమె చిన్న పాపను గుర్తుంచుకుని మరీ పిల్లల దుస్తులు కూడా వేశాను...
ఆమె రాలేదు...
ఇంకో రోజు...
చూస్తుందే గాని, రాలేదు.
నేనే అడిగి ఇద్దామనుకున్నాను...
కాని, ఆ అభిమానవతి ఆత్మాభిమానాన్ని 
నా దాన ప్రతిభతో అవమానించడం తగదని ఊరకున్నాను.
ఆ తర్వాత నా హడావిడిలో నేను బిజీ అయిపోయాను..
వాళ్లు ఆపరేషన్ అయిపోయి వెళ్లిపోయారు.
సడెన్ గా ఓ రోజు చూసుకుంటే...
నా ఇన్నర్స్ రెండు మిస్ అయ్యాయి...
సడెన్ గా ' ఆమె' గుర్తొచ్చింది.
అంటే, ఆమె, వాటి కోసమా?
ఒక స్త్రీ, సాటి స్త్రీ, తన స్త్రీత్వాన్ని కప్పి ఉంచుకోడానికి...
కన్నీళ్లాగలేదు,,,,,,
...గుండెల్లో ఎవరో కెలికినట్లవుతోంది...
సాటి మనుష్యులకు సేవ చేసుకోవడం, 
బాధ్యత కాదు భాగ్యం. 
సేవే మహద్భాగ్యం 
... అని గురువులు చెప్పిన మాటలు...
అర్థమయ్యాయి..!

ఇంత ఆధునికమైనప్పటికీ
సమ కాలీన సమాజంలోని,
కొన్ని విషయాల గురించి..
రాయడానికి కూడా.. ఎంతో ధైర్యం కావలసి వస్తోంది.
..., భూమి మన ఇల్లే, కాని 
భూమ్మీద ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి..,
అన్నం కోసం ఒకడు దొంగ అవుతున్నాడు...
పొట్టకూటి కోసం ఒక స్త్రీ వ్యభిచారవుతోంది...
అదుపులేని స్వేచ్ఛతో ఒక పురుషుడు 
ఆ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు...
అధికారం కోసం కొందరు మనుష్యులు పశువులవుతున్నారు...
ధన దాహంతో ఎందరో దోపిడీదారులవుతున్నారు...
కండ బలంతో కొందరు
యుద్ధాలకు కారణమవుతున్నారు...
తెంపరితనంతో కొందరు 
విజ్ఞానులమని విర్రవీగుతున్నారు...
అమాయకత్వంతో కొందరు 
కొడిగట్టి పోతున్నారు...
అబలత్వంతో కొందరు 
అత్యాచారాలకు గురి అవుతున్నారు...
అంతరిక్షంలో విహారాల కోసం కొందరు
రంగుల కలలు కంటున్నారు...
కురుపులుగట్టిన రోగాలతో కొందరు
గుడి మెట్ల కింద చేతులు చాస్తున్నారు...
సహజ వాంఛలు తీరని కొందరు 
తిరుగుబోతులవుతున్నారు...
సహజ రసాయన ప్రేరితులై,
దొంగ చాటుగా సమాజం గోడలను దాటే ఎందరినో చూశాను...
నా ఉనికిని రహష్య పరుస్తూ 
వారి ఉదంతాన్ని అరహష్య పరచకుండా..
నా వంతు సేవను నేను చేస్తూనే ఉన్నాను.
సంపద విషయంలో, 
సంస్కృతి విషయంలో,
జీవ-భౌతిక-రసాయనిక..
సహజ వాంఛల విషయంలో,
సమాజంలోని పద్దతులను..
మార్చండి..మార్చి తీరండి! 
ఆకలి, నిద్ర, సుఖాల కోసం
అంతులేని అంతిమ ఆనందాల కోసం...
ప్రతి మనిషి అన్వేషణ, ప్రయాణాలు 
కొనసాగుతున్నాయి...
..., భూమి మన ఇల్లే, కాని 
భూమ్మీద ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి..,
...అర్హత సాధించే ప్రయత్నంలో...నేను..........}} 

Friday, December 16, 2011

Make Today Count


 Good Decisions - Daily Discipline =
                   A Plan without a payoff.
Daily Discipline - Good Decisions =
                  Regimentation without Reward.
Good Decisions + Daily Discipline = 
                  A Masterpiece of Potential.
A Masterpiece of Potential:
1) Attitude    2) Priorities
3) Health      4) Family 
5) Thinking   6) Commitment
7) Finances  8) Faith
9) Relationship 10) Generosity
11) Values   12) Growth.