Saturday, December 31, 2011

A JOURNEY...in to d future


ఉత్సాహం...
కాలం కణాలను సరికొత్త క్షణాలుగా రగులుస్తుంది.
కదిలే ప్రతి క్షణాన్ని...ఉత్సవం చేస్తుంది.
జీవితంలో పిల్లల్లాంటి...
అబ్బురం ఉండాలి.
బాలానాం రోదనం బలం, ఆటా ఆనందం!
వేడెక్కించే వేదనను...
ఓ గంట ఏడ్చయినా పోగొట్టుకోవాలి.
ఉత్సవంలా ఉవ్విళ్ళురాలంటే...
జీవితమనే ఆటను అలవోకగా ఆడాలి,
జీవితాన్ని అలవోకైన ఆటగా..ఆడాలి!

వర్షం కురుస్తున్న మబ్బుల్ని చీల్చుకుని..
సూర్యుడు తొంగి చుస్తే..అదే ఓ అబ్బురం.
అదే ఎండ మల, మల మాడుస్తున్నప్పుడు..
కాకి రెక్కంత మేఘం కనిపించడమే..కమనీయం.
చిక్కటి చలిలో..
మిల, మిల మెరిసే నక్షత్రాలే వెచ్చని ఉత్సాహం.
మొగ్గ పువ్వై వికసించడమే.. పరమాద్భుతం.
బోసి నవ్వులు చూడగలగటమే.. పరమానందం.
ఆడ పిల్ల మోమున కమ్మిన కురుల వీక్షణమే సౌందర్య ఆరాధనం.
గడ్డి పుల్ల, గుడ్డి కుక్కా
చెత్త దిబ్బ, నీటి చేప, నింగి చుక్కా..
విశ్వపు కణ, కణంలో
క్షణ, క్షణంలో 
కొత్తదనం ఉవ్విల్లూరిస్తుంది..,
ప్రతి క్షణం..మార్పుతో పరవళ్లు తొక్కుతూ ఉంటుంది.

ప్రకృతంటేనే మార్పు..
సృష్టంటేనే మార్పు..
చరిత్రంటేనే   మార్పు..
మనిషంటేనే.. మార్పు
మార్పు, మార్పు, మార్పు..
జీవితమంటేనే... మార్పు!..
అది మనిషిదైనా, మట్టిదైనా
ఇంటిదైనా, మింటిదైనా!
గడచిన క్షణంతో సరిపెడితే
మరు క్షణానికి రూపమే ఉండదు.
పిల్లాడు పెద్దైతే...
వయసు మొదలవుతుంది...
అదింకా పెరుగుతూనే ఉంటుంది...
అంతర్గత మార్పుల వైపు మనసు అనే కొత్త సచలిత రూపం వైపు.
మనసు..ఒక్కో మెట్టూ ఎక్కుతూనే ఉంటుంది...
గర్భ గుడి చేరుతుందా మార్గం.
కానీ, పూజ అప్పుడే మొదలవుతుంది..

ఆశ, ఆనందం 
సుఖం, సంతోషం 
త్యాగం, దుఃఖం 
కామం, తృప్తి 
ధనం, ఆనందం..
ఎప్పుడూ, ఎక్కడా మనిషికి.. ఇది,
చాలనిపించదు.., ఇక్కడ ఆగుదామనిపించదు 
నడవడానికి నేల అందుతూనే ఉంటుంది..
మెట్టుపై ఇంకో మెట్టూ
గుట్ట పై ఇంకో గట్టు 
గుట్ట మీద చెట్టు పెరుగుతూనే ఉంటుంది 
చెట్టు మీదుండే గువ్వా పెరుగుతూనే ఉంటుంది
గువ్వ గుండెల్లో ప్రేమా పెరుగుతూనే ఉంటుంది...
చెట్టు పెరగడం ఆగినా, ఆ ప్రేమ పెరగడం ఆగినా 
వాటి చెలిమికి విలువ లేదు,
వాటి ఉనికికి ఊపిరి లేదు, 
అవి నిన్నటి పాత కథలవుతాయి.
మారక పొతే.. శిలలనైనా శిధిలాలంటారు.
పెరగక పొతే చెట్టునైనా ఒట్టి కట్టే అంటారు!

ఆశ్చర్యం పోయాక 
అది ఉత్సవం కాలేదు.
అబ్బురం కానప్పుడు 
అది ఉత్సాహం ఇవ్వదు.
కానీ, కాలం..
కాలమే ఒక ఉత్సవం
కాలమే ఒక ఉత్సాహం
కాలమే ఒక స్వకీయ ప్రవాహం
అది మారుతూ ఉంటుంది,
అనంతాల హద్దుల వైపుకు..
పెరుగుతూ ఉంటుంది,
నిన్ను కూడా మారుస్తూ ఉంటుంది...
నీ ఆశ లాగా.., నీ శ్వాస లాగా
నీ కాంక్ష లాగా.., మరిగే నీ మనసు లాగా
నీ ప్రేమ లాగా.., నీ లోని సుఖ లాలస లాగా
నీ ఆనంద ఆకాంక్ష లాగా.., ఎంతకీ శాంతించని నీ అహం లాగా
నువ్ తల్లడిల్లే శాంతి కాముకత లాగా.., నువ్ విరాగించే మోక్ష సాధన లాగా
.. నువ్వు మారుతూనే ఉంటావు..,
కొత్త ఎత్తుల కొలతలకు.. ఎదుగుతూనే ఉంటావు..
ఏ క్షణంలో నీవు మారటం మానేశావో...
ఆ క్షణంలో నీవు...
ఆ క్షణం లోనే నీవు మరణించావు!
Anything that does not grow..
                    ..eventually DIE!
So, Allow yourself to grow,
Happiness is... in the JOURNEY!!

Friday, December 23, 2011

నాది ఈ ప్రపంచం.., కాదేమో!


నాది ఈ ప్రపంచం...
.., కాదేమో!..., ఏమో అలా అని,
అనిపిస్తోంది ఎన్నో సార్లు.
ఏం అనుకున్నా, ఎంత అనుకున్నా...
అనుకున్నది.., చేసే అర్హత ప్రతి ప్రతీకాత్మకూ...ఉంది.
అందుకే,
నా ఊహలు ఈ భూమ్మీద కాలు మోపలేనప్పుడు..
నా కలలను ఈ ప్రపంచం అంగీకరించటం లేదని,
మరో ప్రపంచానికి వలస పోతూ ఉంటాను..!
ఆ మరో సుర ప్రపంచంలో
యక్షిణిలా విశ్వ గవాక్షాలను తొంగి చూశాను.
ఖగోళ తబలల లయ, విన్యాసాలను వింటూ
గంధర్వ గానాలను ఆలపించాను.
దేవ కన్యలా నక్షత్ర ఉద్యాన వనాలలో
సుదూర వింత గ్రహాలను చెలికత్తెలుగా చేసుకుని
మధుపమై మృదు, మధుర విహారాలు చేశాను.
యే వృద్ధ నక్షత్ర వృక్షం నుండీ
యే పండుటాకులు పట, పటమనిరాలాయో గాని..,
సీతాకోక చిలుక.. లా నేను కంటున్న కల
కళ్లు తెరిచేలోగా కరిగిపోయింది..!
మళ్లీ నిద్ర పోవాలంటే..
భయంగా ఉంది...
గురుత్వాకర్షణ లేక వేళ్లాడుకుని ఉన్న శూన్య శ్మశానాలలో
నా కలలను పూడ్చి పెట్టిన సమాధుల దారుల గుండా
ఎక్కడ నడవాల్సి ఒస్తుందో..
అని నా మనసు వ్యధ చెందుతోంది.

అంతలోనే గుర్తొస్తోంది...
నా మది ఎగురేసిన కలలు
రెక్కలార్చుకుంటూ క్రొంగొత్త లోకాలకు ఎగరటం చూసి ఉన్నానని.
పువ్వులై, పువ్ రెక్కలై
చిలకలై, వెలుతురు తునకలై
అవి ఎగిరే సౌరభ సౌందర్యాలు
నా కనుల ముందు గుభాలిస్తుంటే..
మనసు మరుమల్లెల తోటలా విరబూస్తోంది.
నేనెప్పుడూ ఆ తోటలోనే కదా విహారాలు చేస్తానని,
మనసు ఆ హుషారుతో ఉవ్విల్లూరుతుంది...

కలలు, కలలు...ఎన్నో కలలు...
రెప్పలు మూసిన చోట
మూటలుగా కట్టి ఉన్నాయి.
మూసిన రెప్పల మాటున మాటు వేసి ఉన్నాయి.
లోపలికి..లో లోపలికి...ఆ తలుపులు కాస్త తెరుచుకోవటం కోసం
అవి కలలు కంటున్నాయి...

నేనో పువ్వునంటాయి
అంతలోనే గువ్వనంటాయి
అణువణువునీ మిణుగురు కణికలను చేసీ
ఆకాశంలో వెదజల్లుతాయి..
మంచు శిఖరాలపై లేత కిరణాలను
నా చేతులతో అలంకరింపజేస్తాయి..
మైదానాలను మేలిముసుగులు చేసి
పర్వత పాదాల దగ్గర కూచో పెట్టి సారె పెడతాయి..
వర్షపు చినుకుల తాళ్లను పట్టుకుని
ఊగిన ఉయ్యాలలు...
వెన్నెల వాగులో
కలువ చెలులతో ఆడిన సయ్యాటలు..
జ్ఞాపకాలన్నిటినీ దంతపు సింహాసనాలపై ఉంచి,
ఏనుగులతో చేయించిన అంబారీ సవారీలు..
చందమామ ఇంట్లో ఆడుకున్న
అందాల రాకుమారీ - కత్తి యుద్ధం క్రీడలు..
మబ్బుల పరదాల మాటున
ఊహా సుందరునితో ఆడుకున్న దోబూచులాటలు..
సూర్య దేవుని అశ్వాన్ని దొంగిలించి,
పాల పుంతల మధ్య నుంచి దౌడు తీయించిన
జంట గుర్రపు స్వారీలు..
అడ్డు వచ్చిన అంతరిక్ష నౌకలను ఆట బొమ్మలుగా
తోలుసంచిలో దాచుకున్న సంబరాలు..
రివ్వున భూమ్మీదకు దూసుకు వచ్చి...
హిమాలయ శిఖరాన్ని తాకి అంతరిక్షంలోకి
గిరికీలు కొట్టినప్పుడు పొందిన ఆనందం...
...అంతలోనే...

...అంతలోనే...
హిమ జలపు స్పర్శ తగిలి,
ప్రవరాఖ్యుని పాదాలకు పూసిన పసరు కరిగినట్లు..
కలల రెక్కలనెవరో...
కత్తిరించిన బరువైన సూచన.
బరువెక్కిన ఆ కళ్ల కైపు...ఒంటి దాకా పాకింది..
- దోసెలకు పిండి రుబ్బమని అమ్మ వేసిన కేక చెవులకు సోకింది -
ఇంకేం చేస్తాం??
నీలి పచ్చని ఉప్పుప్పని నీళ్లలో
గులాబి రంగు జల కన్యనై విహరించాలనే
తియ, తియ్యని కలను..,
రేపటికి వాయిదా వేసుకుని,
గొంగళి పురుగులా నా బద్దకపు జీవన ప్రయాణానికి బయల్దేరాను..
ఇంకా వదలని ఊహల రెక్కల ఉనికి స్పర్శ,
నా బాహువుల బరువు కన్నా కాస్త ఎక్కువగా,
లీలగా, సుతి మెత్తగా, గమ్మత్తుగా, ఎంతో మత్తుగా నన్ను
మరో లోకాలకు మళ్లీ, మళ్లీ పిలుస్తూనే ఉంది...

Monday, December 19, 2011

భూమ్మీద ఉండాలంటే...


భూమి నా ఇల్లు...
భూమ్మీద ఉండే జీవ, నిర్జీవజాలాలన్నీ...
నా సహ కుటుంబీకులు.
నాలో ఏ తేడా లేదు,
వారిలోనూ ఏ తేడా లేదు,
నాకూ, వారికీ మధ్యా...కూడా ఏ తేడా లేదు.
నేనంటే...నా ఒళ్లు కాదు...
నేనంటే నా ఇల్లు.
నాకు జన్మనివ్వడానికే నా భూమి పుట్టింది...
నా కోసం.. 
ముందే ఒక విశాల వసతి గృహాన్ని,
మందీ, మార్బలాలనూ సమకూర్చి పెట్టింది.
తన లాగా నన్నూ
ఓ కుటుంబానికి కానుకను చేసింది.
నా కుటుంబానికి...
నేను, ఉపయోగ పడుతున్నానా?
ఉత్సవాన్నవుతున్నానా?
అంతు లేని ఆనందాలను ఉత్పత్తి చేస్తున్నానా?
సహ జీవన సామరస్యాన్ని పంపకం చేస్తున్నానా?
..............

భూమి కుటుంబంలో 
ఏ ఒడిదుడుకులూ లేవు
ఏ అపశ్రుతులూ ఉండవ్
ఏ  అపసవ్యతలూ జరగవ్...
అన్నీ ఏర్పరచబడిన కక్షల్లోనే 
కట్టుబడి కదుల్తుంటాయి.
మరి, నా కుటుంబంలో...?
అన్నీ అవకతవకలే.
ఎవరి ఆకలి చావు సమాధి మీదో 
ఎవరి పాలరాతి మందిరమో 
కట్టబడి ఉంటుంది.
ఎవరి చిరిగిన చీలికల పేలికలతోనో..
ఎవరి  పట్టు బట్టలో 
నేత పడుతూ ఉంటాయి.
ఎవరి చెమట బిందువుల తళ, తళల తోనో..
ఎవరి  బంగారపు ఆభరణాలు 
ముత్యాలద్దుకున్టుంటాయి.
ఎవరి  అజ్ఞానపు, అమాయకపు రీతులో 
ఎవరి ఆధిపత్య, అభిజాతాలకు 
ఆజ్య భోజ్యమవుతుంటాయి.
కాని...,
హక్కుంది...
వారికీ అధికారముంది
ఈ ఇంటి వంట తిని కడుపు నింపుకునే హక్కు,
ఇంట్లో  అందరికీ ఉంది.
ఒకరికి కొంచెం ఎక్కువ, ఒకరికి కొంచెం తక్కువ, ఒకరికి అస్సలు తక్కువ...
...ఇదొక తప్పుడు పంపకం.
ఇంటి ఇనప్పెట్టె పై అందరికీ అధికారముంది 
కొన్ని చేతులకే తాళాలు 
తప్పుడు తెంపరితనం.
ఎండా, వానా,
కష్టం, సుఖం
బాధా, సంతోషం 
ఆనందం హరివిల్లుని అందుకునే అవకాశం అందరిదీ.
నా ఇంటిని ముక్కలు చేసీ,
హక్కులూ, అధికారాలనీ
సమాజం, సౌలభ్యం అని...
ఇంటిల్లిపాదీ కూడబలుక్కుని గతి తప్పినా
తప్పుడు  కక్షలో పరిభ్రమణం
పరిపూర్ణ జీవనం కానేరదు,
కాకూడదు..!
* తిండి, గుడ్డ, గూడులకు భిక్షమెత్తేది.. 
వారి నిర్వీర్యత కాదు.
అది మనం చేసే మోసం.
నిలువెత్తు మోసం.
మనిషి తనను తాను చేసుకునే...మోసం.
దగా పెడుతున్న నువ్వే, దగా పడుతున్న వాడివి కూడ..!

నీది, నాది, వారిది...ఒకే ఇల్లు, 
మన ఇంటి బిడ్డను జోలె పట్టించే దౌర్భాగ్యం మనది.
పిడికెడు అన్నమైనా, పట్టెడు బట్టైనా...
దానం ఇవ్వట్లేదు నువ్వు, 
చేసిన తప్పును కప్పి పుచ్చుకుంటున్నావ్...
దానంగా కాదు, వారికి పొందే హక్కుంది.
మితి మీరిన నీ అపసవ్యతల వల్ల
వీధిన పడుతోన్నది..,
భిక్షమెత్తుతున్నదీ..,
దొంగతనం, వ్యభిచారాది జూద మర్యాదలను 
ముసుగేసుకుంటున్నది...
వారు..ఎవరో కాదు,
నీ కుటుంబం..!
నీ ఇల్లే నీ స్వర్గం.
దాన్ని నరక కూపం చేసుకున్నది.. ఇక చాలు.
ఒక్క సారి ఈ ఇల్లు కూలిందంటే...
కాలి కింద భూమి కరిగిందంటే...
ఎవ్వరవు నీవు?..,
ఈ విశాల, విశ్వ వీధులలో.
చిన్న పిల్లాడవు కూడా కాదు,
తెలిసో, తెలీకో తప్పిపోయావనుకోటానికి...
ఓ మనిషీ తెలిసి, తెలిసి..
ఎందుకు, తప్పిపోయేన్దుకే 
తప్పుడు దారులు వెదుక్కున్టావ్?
సొంత ఇంటినీ, సొంత వారినీ 
మించిన వైభవం లేదు జగతి ప్రగతిలో.
సకల సౌభాగ్యాలతో విలసిల్లే.. 
భూమి మన ఇల్లు.
కాని..,
భూమ్మీద ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి...

{{ L. V. Prasad కంటి ఆసుపత్రికి చికిత్సకు వచ్చిన ఒక నిరుపేద స్త్రీ...
  మా టెర్రస్ పక్కనే ఉండే ...ఆసుపత్రి వాళ్లకు మాత్రమే అద్దెకు ఇచ్చే ఒక బిల్డింగ్ లో 4 రోజులు అద్దెకు 
  దిగింది. వాళ్ల గదికి ఎదురుగుండా టెర్రస్ పై రోజూ నేను బట్టలు ఆరేస్తున్నాను...ప్రతి రోజూ ఆమె దిగాలుగా వాటి వైపు చూస్తూ ఉండటం నేను window లోంచి గమనించాను. సడెన్ గా ఒక రోజావిడ పిట్ట గోడ దూకి ఇవతలకు వచ్చింది.., ఆరబెట్టిన బట్టల్లోంచి కొన్ని తీసుకోవడానికి సిద్దపడుతూ...చుట్టూ చూస్తోంది. నేను sound చేయకుండా ఆమె తీసుకోవడానికి నా వంతు సహకారం అందించాను.
తీద్దామా,   వద్దా 
తీద్దామా, వద్దా...
- త్వరగా తీయ్ - ..నేను
తీగ పట్టుకుంటుంది...
వదిలేస్తుంది...
- తీసుకో -
- నీకేం కావాలో తీసుకో తల్లీ - .. నేను
ఆమె తీసుకో లేదు,
పిట్ట గోడ దూకి వెళ్లిపోయింది.
ప్చ్.., నేనేమైనా శబ్ధం చేశానా?
నా ఊపిరి కూడా బిగపట్టి ఉన్నానే..
నీకు ఆ మాత్రం సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు లేదా??
మరుసటి రోజూ ఆమెను దృష్టిలో ఉంచుకుని మరిన్ని బట్టలారవేశాను...
ఆమె చిన్న పాపను గుర్తుంచుకుని మరీ పిల్లల దుస్తులు కూడా వేశాను...
ఆమె రాలేదు...
ఇంకో రోజు...
చూస్తుందే గాని, రాలేదు.
నేనే అడిగి ఇద్దామనుకున్నాను...
కాని, ఆ అభిమానవతి ఆత్మాభిమానాన్ని 
నా దాన ప్రతిభతో అవమానించడం తగదని ఊరకున్నాను.
ఆ తర్వాత నా హడావిడిలో నేను బిజీ అయిపోయాను..
వాళ్లు ఆపరేషన్ అయిపోయి వెళ్లిపోయారు.
సడెన్ గా ఓ రోజు చూసుకుంటే...
నా ఇన్నర్స్ రెండు మిస్ అయ్యాయి...
సడెన్ గా ' ఆమె' గుర్తొచ్చింది.
అంటే, ఆమె, వాటి కోసమా?
ఒక స్త్రీ, సాటి స్త్రీ, తన స్త్రీత్వాన్ని కప్పి ఉంచుకోడానికి...
కన్నీళ్లాగలేదు,,,,,,
...గుండెల్లో ఎవరో కెలికినట్లవుతోంది...
సాటి మనుష్యులకు సేవ చేసుకోవడం, 
బాధ్యత కాదు భాగ్యం. 
సేవే మహద్భాగ్యం 
... అని గురువులు చెప్పిన మాటలు...
అర్థమయ్యాయి..!

ఇంత ఆధునికమైనప్పటికీ
సమ కాలీన సమాజంలోని,
కొన్ని విషయాల గురించి..
రాయడానికి కూడా.. ఎంతో ధైర్యం కావలసి వస్తోంది.
..., భూమి మన ఇల్లే, కాని 
భూమ్మీద ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి..,
అన్నం కోసం ఒకడు దొంగ అవుతున్నాడు...
పొట్టకూటి కోసం ఒక స్త్రీ వ్యభిచారవుతోంది...
అదుపులేని స్వేచ్ఛతో ఒక పురుషుడు 
ఆ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు...
అధికారం కోసం కొందరు మనుష్యులు పశువులవుతున్నారు...
ధన దాహంతో ఎందరో దోపిడీదారులవుతున్నారు...
కండ బలంతో కొందరు
యుద్ధాలకు కారణమవుతున్నారు...
తెంపరితనంతో కొందరు 
విజ్ఞానులమని విర్రవీగుతున్నారు...
అమాయకత్వంతో కొందరు 
కొడిగట్టి పోతున్నారు...
అబలత్వంతో కొందరు 
అత్యాచారాలకు గురి అవుతున్నారు...
అంతరిక్షంలో విహారాల కోసం కొందరు
రంగుల కలలు కంటున్నారు...
కురుపులుగట్టిన రోగాలతో కొందరు
గుడి మెట్ల కింద చేతులు చాస్తున్నారు...
సహజ వాంఛలు తీరని కొందరు 
తిరుగుబోతులవుతున్నారు...
సహజ రసాయన ప్రేరితులై,
దొంగ చాటుగా సమాజం గోడలను దాటే ఎందరినో చూశాను...
నా ఉనికిని రహష్య పరుస్తూ 
వారి ఉదంతాన్ని అరహష్య పరచకుండా..
నా వంతు సేవను నేను చేస్తూనే ఉన్నాను.
సంపద విషయంలో, 
సంస్కృతి విషయంలో,
జీవ-భౌతిక-రసాయనిక..
సహజ వాంఛల విషయంలో,
సమాజంలోని పద్దతులను..
మార్చండి..మార్చి తీరండి! 
ఆకలి, నిద్ర, సుఖాల కోసం
అంతులేని అంతిమ ఆనందాల కోసం...
ప్రతి మనిషి అన్వేషణ, ప్రయాణాలు 
కొనసాగుతున్నాయి...
..., భూమి మన ఇల్లే, కాని 
భూమ్మీద ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి..,
...అర్హత సాధించే ప్రయత్నంలో...నేను..........}} 

Friday, December 16, 2011

Make Today Count


 Good Decisions - Daily Discipline =
                   A Plan without a payoff.
Daily Discipline - Good Decisions =
                  Regimentation without Reward.
Good Decisions + Daily Discipline = 
                  A Masterpiece of Potential.
A Masterpiece of Potential:
1) Attitude    2) Priorities
3) Health      4) Family 
5) Thinking   6) Commitment
7) Finances  8) Faith
9) Relationship 10) Generosity
11) Values   12) Growth.

Friday, November 4, 2011

ఒక్క మాటలో మనం...


సంస్కారాలు, సంస్కృతులు,
సమన్వయాలు, సమతలు...
సందర్భాలు, సమస్యలు, 
పద్దతులు, పరిష్కారాలు...
సంగతులు ఎన్నైనా ఉండనీ..
ఒక్క మాటలో మనం... Poor Indians..!

...చాలా రోజుల క్రితం ఒక సారి
నా విదేశీ స్నేహితురాలితో కలిసి ఒక సినిమా చూశాను...
'ఒకే ఒక్కడు' అనే ఆ సినిమా చూసి బయటకొచ్చాక..,
నా స్నేహితురాలన్న మాటలు ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి....
సామాజిక స్పృహ గురించిన అలాంటి సినిమాలు చూసినప్పుడంతా 
మనసంతా అదోలా అవుతూనే ఉంటోంది...

"Nice movie...
మీ వాళ్లు చట్టాలు మారినట్లు, 
రాజకీయాలు బాగుపడినట్లు..
society లోని loopholes close అయినట్లు..
courage ఉన్న leaders పుట్టుకొచ్చినట్లు  
ఎంచక్కా సినిమాలు తీసుకుని,
వాటిని చూసుకుని మురిసిపోతారు...
ఏదో పాపం అలా అయినా కాస్త ఆనందపడతారనుకుంటా 
poor Indians..." అంది.

ఆమెకెంతో ఉత్సాహంగా movie చూయించిన నేను అవాక్కయ్యాను!
ఆ తర్వాత...
movie లోని 'నెల్లూరు నెరజాణ..' song బాగుంది..
let us dance అనడమూ...
అది practice చేసీ..ఒక occasionలో perform చేయడం జరిగాయనుకోండి..,
అది వేరే విషయం!

ఆమె అన్నట్లుగా మార్పును 
సినిమాల్లోనో, కథల్లోనో...
నాటకాల్లోనో, regular బాతఖానీల్లోనో తప్ప 
మనం మారడం లేదు, మార్చుకోవడమూ లేదు.
ఒక revolutionary story విన్నా, చదివినా, సినిమాలో చూసినా  
నిజంగానే ఆ మార్పును realగా తెచ్చుకోలేని  
poor Indiansమేమో అని అనిపిస్తోంది...
కొంచెం బాధగా ఉన్నా ఇది నిజమనుకుంటా...

Thursday, November 3, 2011

A Game -By స్థల, కాల, పరిస్థితులూ..?

...Situations demands emotions
Emotions commands Relations
Relations Creates Situations...
పరిస్థితులు-స్థల, కాల, పరిస్థితులు- భావోద్వేగాలను...
భావోద్వేగాలు బాంధవ్యాలను ప్రభావితం చేస్తాయి!
Balence చేసుకుంటూ జీవించడాన్నే స్థితప్రజ్ఞత అంటారని తెలుసు 
కానీ, ఈ స్థల, కాల, పరిస్థితులు...
నా భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయి!
'ఇప్పుడు' పుట్టకున్నా బాగుండేది..
'ఇక్కడ' పుట్టకున్నా బాగుండేది...
'ఇలా' పుట్టకున్నా బాగుండేది...
నా Physical bodyయే నాకు ఒక jail లా ఉంది!
Inner Soul స్వేఛ్చ కోరుకుంటోంది...
అంతరంగ అవసరాలకు అనుగుణంగా 
బహిర్గత భాధ్యతలు నేరవేర్చలేము.
లోపలి మనిషి సహించడం లేదు
బయటి మనిషి మాట వినడం లేదు...
ప్చ్, హా...హ్మ్...

సరిగ్గా ఆలోచించాలని ఎంత బలంగా అనుకుంటుంటే...
అంత కన్నా బలంగా సరిగ్గా పనిచేయలేకున్నాను...
నాకు ఒక సరైన శిక్షణ కావాలని అనిపిస్తోంది.
గాయం అయ్యింది కాబట్టి నొప్పి వస్తోందో...
నొప్పి వస్తోంది కాబట్టి గాయం అనుకోవాలో...
అర్థం కావడం లేదు?
టైం సరిపోవడం లేదు కాబట్టి పనులు చేయడం లేదో...
పనులు చేయడం లేదు కాబట్టి టైం సరిపోవడం లేదో...
అస్సలు టైం ఉన్నట్లా, లేనట్లా
అయితే...అంతకన్నా అస్సలు...
నేను ఉన్నట్లా, లేనట్లా 
చూడటానికి నా physical body ఉన్నట్లే ఉంది...
కానీ, చూస్తుంటే...నా inner soul లేనట్లుగా ఉంది!
కనీసం..ఇప్పుడు లేదేమో...
హీనం...ఇక్కడ లేదేమో...
హీనపక్షం...ఇలా ఉండ లేదేమో...
నాకు నేను నచ్చట్లేదు...
నచ్చట్లేదు...నచ్చట్లేదు...
ఇది నేను కాదు.

అదిగో...
ఆకాశంలో ఎగురుతోన్న ఆ పక్షిని నేనేమో...
ఆ చెట్టు మీద కదులుతోన్న ఆకుల మధ్య, 
వీస్తోన్న గల, గల గాలిని.. నేనేమో...
నా కలల్లో కనిపించే సీతాకోక చిలుకను నేనేనేమో...
ఊరి బయట తోటలో తుమ్మెదలు తాగుతోన్న 
పువ్వులలోని తేనెను నేనేనేమో... 
ఒకానొక పాడుబడ్డ బావిలో 
పాత రాతి మెట్టును నేనేనేమో...
ఏమో...ఎగరాలని ఉన్నా కూడా,
నేల మీద పురుగుల పాకుతున్నది ఎవరో?
పూర్వం ఒక కథలోనే అయినా
ఓ ఈగ తన పేరు మరచిందని విన్నాను..
ఇప్పుడేమో నేనెవరో నాకే గుర్తు లేదు.
ఈ విడ్డూరం విని, 
ఎగరలేని చెట్లు చేస్తోన్న ఎగతాళికి...
అదిలిస్తే పారిపోతున్న పిట్టలా 
నా నేను ఎక్కడికో పారిపోతోంది...
అయినా వదలక, 
ఎదలోని సొద ఎలదేటి రొదలా
వెంటే ఉంటూ తరుముకొస్తోంది...

మనకు ఆకలంటే బాధ
కానీ మనం అన్నాన్ని దాచిపెడతాం.
మనకు డబ్బున్న వాళ్లంటే భయం
కానీ, మనందరం డబ్బు సంపాయించాలనుకుంటాం!
చలేస్తే ఎండంటాం
ఎండొస్తే.. వానంటాం 
వానొస్తే...గొడుగంటాం
ఏదో ఓ గోడ కట్టుకోకుండా 
మనం బతకలేమా?
నేను పారిపోతున్నానో
తప్పిపోయానో...
తప్పించుకుపోవాలని ఈ తపన!
ఈ కలుగు పై అలిగానానని అనిపిస్తోంది...
ఒక్కోసారి అదే కదా ఆశ్రయమిచ్చి ఆదుకున్నది అనిపిస్తుంది...
అంతలోనే అదో అంతులేని కథ అని భయమేస్తుంది.

ఆకులకంటే పువ్వులు అందమైనవే
కానీ నా చెట్టుకు అవే ఊపిరి.
వేళ్లతో పాటు ఊడలు కూడా 
పాతుకపోవడమే జీవితం.
ఈ సత్యం అర్థమైనా 
ఉన్న చోటునుండే ఊగిసలాడ్డం ను 
ఆపదు అంతరంగ తరంగం...(((((((((((
అందుకే అంటారు...
అద్దానికి ఏ దుమ్మూ అంటకుండా 
ఆనందాన్ని మాత్రమే చూసుకునే వాళ్లను...
'ఏ తాడూ-బొంగరం లేని వాడని'...
అంతేనేమో...
జీవితమంటే ఆట..
మనం ఆడుకునేది కాదు,
మనల్ని ఆడుకునేది! 
{ Oh My God నన్ను ఎవరైనా కాపాడండి...నేను గింగిరాలు తిరుగుతున్నాను...((((((())))))).....}
[ నిజంగానే.. నాకేం చేయాలో అర్థంకానప్పుడు, అలా బొంగరంలా తిరగేస్తా...ఎవర్నైనా వచ్చి hold చేయమంటా..!]

Friday, October 21, 2011

let the soul fly like a bird from the GOLDEN CAGE

When you have a CHARACTER... 
you have some kind of neurosis. 
Character means... 
something has become fixed in you. 
Character means... 
your past. 
Character means... 
conditioning, 
cultivation
When you have a character... 
you are imprisoned in it, 
...you are no more free. 
When you have a character... 
...you have an armor around yourself. 
You are no more a free person. 
You are carrying your prison around yourself; 
it is a very subtle prison... 
A real man will be... CHARACTERLESS! 
- from a PURE-white- SOUL

Tuesday, October 11, 2011

I am in love,,,

చల్లని పిల్ల గాలులు
వెచ్చని సూర్య కిరణాలు
జాబిలి ఉదయాలు
సూర్యుని అస్తమయాలు...

ఎడారి వేడుకలు
మంచు శిఖరాల నిర్లిప్తత
సంద్రపు కెరటాల ఉత్సవికత
పర్వతాల పరిణత
లోయల వికాసము
మైదానాల మంద గమనము...

కాంక్రీట్ కీకారణ్యంలోనూ, కనుపాప నిండా

కనువిందు చేసే తూనీగల ఝూంకారం...
అల్లన భూమ్యాకాశాలను కలుపుతున్న 
జోరువాన సంగీత రూపకం...
గుప్పెడు గింజెలు జల్లితే..,
గుగు, గుగు అంటూ బస్తీ కబుర్లు చెప్పే పావురాయిలు...
కాస్త పచ్చగా యే పాటి చెట్టు కనిపించినా కొమ్మన చేరి..
పాట కచేరీలు చేసే కోయిలలు...

నా తలుపులు మూసుకుని నేను కూర్చున్నా
ఎక్కడో ఓ మందిరం నుండి కాస్త భక్తి సంగీతం...
మరెక్కడో ఉండే మజిద్ నుండి గాల్లో తేలి వచ్చే ప్రార్థన...
ఈ వీధిలోనో, ఆ వీధిలోనో విహారాలు చేసే పిల్లల శబ్ధం...
మరో చోటు నుంచి అమ్మలక్కల మాటలు...
వాహనాల రొద, గొడవల సొద,
అరుపు-కేక...ఏదైతేనేం...
మనిషి ఉనికిని తెలిపే మధురమైన శబ్దపు స్పర్శ...
ఆహా...భూమ్మీద ఎక్కడకెళ్లినా..,
ఈ స్పర్శే కదా మనల్ని సజీవుల్ని చేస్తుందీ....
ఈ 'ఉనికి' స్పర్శతో ప్రేమలో పడకుండా 
నన్ను నేను ఆపుకోలేను...
ఎక్కడ ఉన్నా...
స్థల, కాల, పరిస్థితుల అన్నిటియందు....
సదా ఆ ప్రేమలో మునిగితేలుతూ...నేను..
...I am so in Love with Life! 
I Love the Ground that I walk on, 
I Love the air that I Breathe, 
I Love Being here,
I am simply in Love with Life...
భూమ్మీద పుట్టాక భూమితో ప్రేమలో పడక తప్పదు,
భూమ్మీద ఉండే వాటితోనూ ప్రేమలో పడకా తప్పదు!

Wednesday, October 5, 2011

నాకు బతకాలని ఉంది.

నాకు బతకాలని ఉంది..
నేను ఎందుకు చనిపోవాలి?
మనిషై పుట్టాక చని.. పోవలసిందే...
కానీ, నేను అర్ధాంతరంగా నా కలలను ముగించుకుని ఎందుకు చచ్చిపోవాలి?

నా సుకుమారమైన వెన్నెముకే ఎందుకు
ఒంటరిగా ఈ సృష్టి బరువును మొయ్యాలి?
మనుష్యులం ఇద్దరుగా ఉత్పత్తి అవుతాము,
మరి 'ప్రత్యుత్పత్తి' మాత్రం నా ఒంటరి భుజ స్కందాలపైనే ఎందుకు?

మనిషి ఎన్ని కనిపెట్టాడూ...
చీకటి ఉందని వెలుతుర్ని,
నడవలేనని వాహనాలను,
వేటాడలేనని వ్యవసాయాన్ని,
ఆరోగ్యం కోసం, ఆహారం కోసం
సౌక్యం కోసం, శాంతి కోసం...
కానీ, నా కోసం.. నేను చావకుండా ఉండటం కోసం...
ఏమీ కనిపెట్టలేవా... ఒక యంత్రాన్నో, మంత్రాన్నో...
చెట్టు కొమ్మను కాస్త తుంచి అంటుగట్టినట్లు...
మనిషి శరీరం లోంచి కాస్త తుంచి యే పరీక్ష నాళికలోనో
ప్రాణం... పోయోచ్చుగా...

బస్సులు, పడవలు
బిల్డింగ్ లూ, ఫ్లయింగ్ లూ
కంప్యూటర్లు, లాప్టాప్ లూ,
చిప్ లూ, మైక్రో చిప్పులు
రాకెట్లు, శాటిలైట్లు...
హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్లు, కాంటాక్ట్ ఐ లూ...
ఇంత కన్నా ముఖ్యం కాదా ప్రత్యుత్పత్తి యంత్రం!!

నిముషం క్రితం మీ లాగే నవ్విన నేను మరుక్షణంలో
మరణిస్తున్నానంటే... మీకేమీ బాధ్యత లేదా?
నేను కూడా మీ లాగే బ్రతకడానికే పుట్టాను.
అంతే గానీ ఇంకో మనిషిని పుట్టించే క్రమంలో...
నేనో... గాలి పిందెలా.. ఇంకెన్ని యుగాలు ఇలా నేల రాలాలి?

scientist లు, socialist లు
activist లు, humanist లూ...
ఆ ist లూ, ఈ ist లూ...
ఏవి ముందుగా కనిపెట్టాలి?
యే పని ముందుగా చెయ్యాలీ...
కాస్త priority's చూసుకోండి...

అప్పుడెప్పుడో... వేల ఏళ్ల నాడు
మహా భారత దేశంలో గాంధారి కుండలో కొడుకుల్ని కన్నది
ద్రోణుడనే జ్ఞాని కుంభ సంభవుడయ్యాడు
కుంతి కులట అవ్వకుండానే కుమారులను కన్నది
అంత కన్నా అతి పూర్వం...
శ్రీ రామ రాజ్యం లో సీతా దేవికి వాల్మీకి మహర్షి...
వొంటి మట్టిని తొవ్వి కుశుడనే బాలునిగా బ్రతికించాడు...

అతి సమీపంలో 33 ఏళ్ల క్రితం...
తొలి test tube babyని దిగ్విజయం చేసినా...
ఇంత వరకూ.., Complete In vitro fertiliZation

మాత్రం కనిపెట్ట లేక పోయారు.
ఆ పునరుత్పత్తి కుండలను కనిపెట్టే కుమ్మరి scientist...
...ఎప్పుడు పుడతాడో...
అసలు పుడతాడో... 
పుట్టకుండానే ఒక నాటికి నాలా ఈ పుడమీ కన్ను మూస్తుందో...
నన్ను కాక పోయినా, నా భవిష్యత్తు సోదరిలైనా 
నిండు నూరేళ్లు బ్రతుకుతారో... లేదో...

ఆకాశం అంతులు తర్వాత కనుక్కుందురు
భూమ్మీద నా చావును కాస్త ఆపండి.
నేనూ మీ లాగే పుట్టాను
మీ లాగే బతకాలనుకుంటాను.
Scienceని , దేవున్నీ
దేవుని దయ వలన scienceని
ఎన్నో పనులు చేసేకి ఎన్నెన్నో machines కనిపెట్టారు...
నా పని చేసి పెట్టే machineని కూడా ఒకటి కనిపెట్టమని... 
నాకు  కాస్త ఊరట కలిగించమని వేడుకుంటూ...
మహా భారత దేశంలోని గాంధారి పాటి పుణ్యం చేయలేక పోయానే అని...
బ్రతకాలన్న ఆశ బలంగా ఉన్నా బ్రతకలేక చచ్చి... పోతున్నాను...
{ 'లక్ష్మి' అనే ఒక స్నేహితురాలు ప్రత్యుత్పత్తి పథకంలోని, 
పునర్జన్మ facility పొందలేక..,
బలవంతంగా పరలోక ప్రయాణానికి వెళ్లిపోయిన బాధలో.... 
భయపడుతూ ..."పునర్జన్మ" పొందిన నేను........ }...

Saturday, October 1, 2011

నిన్ను నువ్వు


నిన్ను విశ్వమంతా వెదజల్లేవి నీ ఆలోచనలే! 
నీ ఆలోచనలను నువ్వు అంగీకరించకపోతే....
నీ అంతరంగాన్ని నువ్వు అనుమతించకపోతే...
నీ ఆత్మకు నువ్వే ఇనుప కారాగారానివి!!
{ So.., అంగీకరించడానికి అనుమతించబడే ఆలోచనలనే ఆలో...చించండి..!} 


Sunday, September 25, 2011

సాటి మనుష్యులు...

{ ఒక స్నేహితురాలి ప్రశ్నకు సమాధానంగా... }
..........
ప్రశ్న: 
అందర్నీ darling, dear అంటున్నావ్ నన్ను dear అన్నట్టుగానే.. !
కొంత మంది sisters..ఇంతకు నేను dearనా కాదా? అర్థం కావట్లేదు. 
...madam, darling, dear, గురువు గారు..sister...
చాలా characters చేస్తున్నావ్ కదా!
don't mind...నిన్నటి దాకా నువేదో వాళ్ల g.f ఏమో అనట్లుగా మాట్లాడిన వాళ్లు... 
sudenga sister అంటే.. వెంటనే bro అనేస్తావ్...
relations manage చేయడం రాక fb రావటం మానేశా..నువ్ great dear...

నేను: 
ఏం చెప్పాలో అర్థం కాక...బుర్ర గోక్కుంటున్నాను...
..నేనేదో ఓ జ్ఞాన సముద్రం దగ్గర...
ఓ మారు మూల ఒడ్డున కూచ్చుని,
చిన్న చెలిమ తొవ్వుకుంటున్నాను దాహంతో.
మా దాహం కూడా తీర్చుకుంటాం అని.. 
మరి కొందరు దాహార్తులు...అటు వెళ్లే బాటసారులు అక్కడికి వస్తున్నారు...

వచ్చిన వాళ్లు వాళ్ల వాళ్ల బొచ్చెలు వాళ్లు చేతబుచ్చుకునే వస్తారు!
వాళ్లు గ్లాసు, చెంబు, గిన్నె, స్పూను, బిందె, బక్కెట్టు, డ్రమ్ము...
లేదా దోసిలి...వాళ్ల పాత్రలు వాళ్లు తెచ్చుకుంటారు...
వాళ్లు ఎంత తాగి.., ఎలా తాగి దాహం తీర్చుకోగలరో
అలా దాహం తీర్చుకుంటారు...
చెలిమ తవ్వుతున్నాను కదా అని వాళ్ల మీద నా పెత్తనం ఏమిటి???
అలా లేదు, ఉండదు!

అక్క, చెల్లి, ప్రియురాలు, స్నేహితురాలు, గురువు, అత్తా, పిన్ని, మమ్మీ...
వాళ్లు నన్ను ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం...
వాళ్లను నేను ఏమనుకుంటున్నానూ...అనేదే నాకు ముఖ్యం!
వాళ్లను నేను నా లాంటి జ్ఞాన దాహార్తులు...అనుకుంటున్నాను...
నాలాగే జీవితాన్వేషణా సహా బాటసారులూ అనుకుంటున్నాను...
అన్నిటికన్నా... నా... "సాటి మనుష్యులూ"... అనుకుంటున్నాను!!!