Sunday, July 18, 2010

యుద్ధం జరిగేటప్పుడు


యుద్ధం జరిగేటప్పుడు నిద్రే రాదు
ఆదమరిస్తే అంతం ఆక్రమిస్తుంది...

...కళ్లు మూద్దామన్నా
రెప్పలు మూతబడవు
తాను బ్రతకాలని
కన్ను అనుకుంటుంది
నన్ను బ్రతికించుకోవాలని
నేను అనుకుంటాను
మాయల పకీరు ప్రాణాలు ...
ఏడేడు సముద్రాలవతల మఱ్ఱిచెట్టు తొర్రలో ఉన్న
రామచిలుకలో ఉన్నట్లు ,
నా మాయదారి ప్రాణాలు ...
ఎల్లలు లేని విశ్వం పుస్తకంపై , ఎడ తెగని రాతలు రాసే
నా పెన్నులో ఉన్నాయి.
ఈ యుద్ధం చెయ్యాలని
నేనెప్పుడూ  ఉవ్విళ్లూరుతూనే ఉంటాను
ఇక పరిస్థితులు చేయి దాటగానే
యుద్ధం మొదలవుతుంది ...
మొదలైతే నా చేతిలోనే
కానీ, ఇక చాలించడం దాని చేతుల్లోనే! 


జయించాలీ!... జయించాలీ!!
..జయించాలి... 
ఒక్కో ఆలోచననుజయిస్తూ రావాలి
ప్రతి ఆలోచనను లేగ దూడను చేసి
నా గాటన కట్టేయాలి.
ఆ పాడిపంటలతో కళకళ లాడుతూ
నా రాజ్యం సస్యశ్యామలం కావాలి.
ఈ స్వర్గంలో ఆడుకోవడానికి...
దివి నుంచి దేవతలు భువికి రావాలి! 


( అన్నమయ్యకు , త్యాగయ్యకు, క్షేత్రయ్యకు,
పోతనకు, రామదాసుకే కాదు, ప్రవీణకు కూడా...
... ఏలియన్స్ 
-దేవతలు- ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి తీరాలి మరి! ఉన్నారు కూడా!!) 


No comments:

Post a Comment