కొత్తగా ఈ ప్రపంచంలో
ఏదీ...పుట్టదు!
విశ్వ విస్ఫోటనాన్నీ
యుగాన్తాన్నీ...
గాలినీ, ధూళినీ
చెట్టును, పిట్టను
నిన్నూ, నన్నూ
కాలం మోసుకొస్తూ... ఉంటుంది.
మంచు కొండలను
సెలయేళ్ళు చేస్తుంది
ఉప్పు సముద్రాలను
మేఘాలుగా మార్చి కుమ్మరిస్తుంది
విత్తనాన్ని...
చెట్టు చేసి చూపిస్తుంది
పర్వతాలను
లోయలుగా పడగొడుతుంది
లోయలను
పర్వతాలుగా నిలబెడుతుంది
అమీబాను పుట్టిస్తుంది
మనిషిని సృష్టిస్తుంది!
భూమిని పిడికిట ముద్ద చేసి విసిరేస్తుంది
విశ్వ విపణిలో బొంగరంలా గింగిరాలు కొడుతున్నఆ భూమిని
ఖండ ఖండాలుగా విడగొడుతుంది...
కాలం కడుపులో
విశ్వమే విందు భోజనమవుతుంటే...
ఆ విస్తట్లో అప్పడం ముక్కలం కాని...మనమెంత?
అయినా మనల్ని...'ఎంతో' చేసి చూపించింది
అంతలోనే మళ్లీ ఆడేసుకుంటుంది
సంతోషాలను కష్టాలతో కబళిస్తుంది
ఆ కష్టాలను సుఖాలుగా అనువదిస్తుంది...
కాలం ప్రదర్శిస్తున్న ఈ మేళాలో
కొత్తగా మనం
కొనుక్కోవలసినవీ, కనుక్కొవలసినవీ ఏమీ లేవు,
చక్కర్లు కొడుతోన్న ఆ చక్రపు విస్తట్లోంచి...
మన వంతు మనం తీసుకోవడమే మన పని!
చాలా బాగుంది.....finishing nice.....
ReplyDelete