పేదరికం..
సిగ్గుపడాల్సిన విషయం కాదు
పేదరికం "పేదవాడు" సిగ్గుపడాల్సిన విషయం కాదు,
ఇది.. దాచుకోవడం నేర్చుకున్న "మానవజాతి" సిగ్గుపడాల్సిన విషయం!
ఆకలి..
బాధపడాల్సిన విషయం కాదు
ఆకలి "ఆకలిగొన్నవాడు" బాధపడాల్సిన విషయం కాదు,
ఇది.. దోచుకోవడం నేర్చుకున్న "మానవజాతి" బాధపడాల్సిన విషయం!
ఓటమి..
తలదించుకోవలసిన విషయం కాదు
ఓటమి "ఓడినవాడు" తలదించుకోవలసిన విషయం కాదు,
ఇది.. ఓడించడం నేర్చుకున్న "మానవజాతి" తలదించుకోవలసిన విషయం!
ఆపద..
అసహాయంగా రోదించవలసిన విషయం కాదు,
ఆపద "అసహాయుడు" రోదించవలసిన విషయం కాదు,
ఇది.. సాటిమనిషికి సాయమందించుకోలేని "మానవజాతి" రోదించవలసిన విషయం!
రోగం..
కృంగిపోవలసిన విషయం కాదు
రోగం "రోగి" కృంగిపోవలసిన విషయం కాదు,
ఇది.. పరస్పరం సహానుభూతి చెందలేని, సేవ చేసుకోలేని "మానవజాతి" కృంగిపోవలసిన విషయం!
ఒంటరితనం..
కలవరపడాల్సిన విషయం కాదు
ఒంటరితనం "ఒంటరివాడు" కలవరపడాల్సిన విషయం కాదు,
ఇది.. కాలం కర్షణలో ఒకరికొకరు తోడు ఉండలేని కరడుగట్టిన, స్వార్థ, కఠిన హృదయం పొందిన "మానవజాతి" కలవరపడాల్సిన విషయం!
అణచివేత..
భయపడాల్సిన విషయం కాదు
అణచివేత "అణగారినవాడు" భయపడాల్సిన విషయం కాదు,
ఇది.. సంకెళ్లు సృష్టించి, అధోగతి సహవాసాలు చేస్తోన్న నిర్దాక్షిణ్య "మానవజాతి" భయపడాల్సిన విషయం!
హింస..
వికలం చెందాల్సిన విషయం కాదు
హింస "హింసించబడే వాడు" వికలం చెందాల్సిన విషయం కాదు,
ఇది.. అహింసను అలవరచుకోలేని "మానవజాతి" కకావికలం చెందవలసిన విషయం!
అగౌరవం
అవమానం
మోసం
ద్వేషం
నింద
ద్రోహం
దోపిడీ
స్వార్థం
పరనాశనం
అన్యాయం
అక్రమం
అభిజాత్యం
జాత్యహంకారం
లింగ వివక్ష
చర్మ వివక్ష
ధన వివక్ష
జ్ఞాన వివక్ష
సరిహద్దు కక్ష
అధికార కాంక్ష
అసహనం
అపరిశుద్ధం...
...అణువణువూ క్షుద్రమవుతోన్న, హృదయదౌర్భల్యమవుతోన్న, మానవత్వ విహీనమవుతోన్న, విశ్వం హృదయానికి ఆరని గాయమవుతోన్న ఈ "మానవజాతి"మనుగడ.. భూమి గడపన, ఆ మట్టి కడుపున ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో...
విశ్వానంతంలో "శిక్షణ"కు అర్హత కోల్పోయిన ప్రతి గ్రహాంతర జాతీ "శిక్ష"కు తలవంచిన చరిత్ర విశ్వ చైతన్యానిది!
No comments:
Post a Comment