అన్నం, తోటకూర మెంతి పప్పు, కాకరకాయ వేపుడు.. టమోటా చెట్నీ... బయట ఎండారబోస్తూ సూర్యుడు...
వాసన చేతి మీద
రుచి నాలుక మీద
అనుభూతి నరాల మీద..
ఎండ నా మీద!
జీవితం వానా కాలం మధ్యాహ్నాలుగా
ఎండా కాలం సాయంత్రాలుగా
చలికాలం రాత్రుల్లుగా ఉంటే ఎంతో మధురం!
ఈ విషయం తలపుకు రాగానే..
కుంపట్లో మొలకలు వేసిన కొత్తిమీర పిలకల సాక్షిగా మనసు పులకలు వేస్తోంది.
చెంబు నీళ్లు.. గ్లాసు తేనీరు పిడికెడు అన్నం.. చిటికెడు ప్రేమ..,
శరీరం మనసు లాగా మరీ ఎక్కువ కోరికలు కోరదుగా!
మొన్నొక సారి పాత గురువు గారొకరు కలిస్తే..
ఎలా ఉన్నారని అడిగిన పాపానికి అడగకుండానే ఇంకో జీవిత పాఠం నేర్పాడు, మహానుభావుడు!
పాడుబడిన ఊళ్లో, పాత ఇంట్లో కొత్త అన్నం తింటూ కొత్త నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నానన్నాడు...
నా చేత్తో పెట్టిన కమ్మటి భోజనం -ఆయన కితాబిచ్చారు మరి- తిని...
వస్తావు పాత ఇంటికి.. ఇక్కడ కొత్త పల్లెరాల్లో పాత భోజనం అలవాటు పాటిస్తున్నావు
పాతింటికి వచ్చాక పాత గ్లాసుల్లో కొత్త రసాలు తాగుతావు అంటూ ఆశీర్వదించారు!
అది నిజమయ్యేలా ఉందని అనిపిస్తుంది.., సరిగా ఇలాంటప్పుడే..
ఏ మధ్యాహ్నపు భోజనం వేళో మస్తిష్కం అరల్లోని జ్ఞాపకాల దొంతరలు మతికి వచ్చినప్పుడు..!
ఒక్క గంటలో తాకిన గాలుల అలలు
నిముషం నాట్యానికే పరిచయమై ప్రాణ నేస్తమైపోయిన నీటి స్నేహం
ఒక్క పూటలో వెయ్యేళ్ల సూర్యున్ని ఆస్వాదించిన నింపాదితనం..
ఒక రేయిలో అనుభవించిన లక్ష పున్నముల వెన్నెలలు
ఒక్క రోజులో కోటి సంవత్సరాల భూమి స్పర్శ...
చలిమంటల కాంతి, మెరుపుల కాగడాలు
ఆకాశంలో చేసిన విహార యాత్రలు, నక్షత్రాల లెక్కలు
చీకట్లో పెట్టిన పరుగులు, రాళ్ల మీద ఆడిన గీతలాటలు
చెట్ల కొమ్మల ఊయలలు, కోనేట్లో కొట్టిన ఈతలు...
... వందేళ్లు తక్కువనుకుంటాం గానీ.., భూమ్మీద కూడా కాలంతో పనిలేని స్థలాలున్నాయి!
అవి మనలోనే, మనతోనే ఉంటాయి. మన జీవితంలా మన చుట్టూ భూభ్రమణం చేస్తుంటాయి... ((((((((()))))))))
No comments:
Post a Comment