Thursday, July 25, 2013

కలలో నీ కోసం పొద్దుతిరుగుడు పువ్వై పూచిన నేను!

రాత్రి!
రాత్రి అంటే.. ఇంతకు ముందైతే.. చీకటి దిక్కులు, మెరిసే చుక్కలు 
చలిగాలులో లేక చిరుగాలులో లేక చిరు జల్లులో, కాని, 
నువ్వు కలిశాక.. రాత్రుల అర్థమే మారిపోయింది.  
ప్రతి రాత్రి ఒక అందమైన కలలా కమ్మగా.. కళ్లు మూసి ఒక కొత్త లోకంలోకి మేలుకున్నట్లు.. 
ఒక్కసారిగా మెలకువ రాగానే...  
నువ్వు నా కళ్ల ముందుంటావు!

.. ప్రతి రేయి లాగే  కలలోకి వచ్చావు 
నా అందమైన ముఖం మీద నీ ముఖం ఆన్చావు.. 
నీ చెంపలు నా చెక్కిళ్లతో యుద్ధం చేశాయి 
మన ఇరువురి శ్వాసలు కాల సర్పాల్లా కలిసి నాట్యం చేశాయి, 
విచిత్రమేంటంటే అవి మన ఉనికినే మరచిపోయాయి! 
ఒక రైతు భూమిని దున్ని సాగుచేసినట్లు... 
నీ దవడ ఎముకలు... నా ముఖ క్షేత్రాన్ని క్షతగాత్రం చేస్తూ సేద్యం చేశాయి  
ఏవో పూల మొక్కల కోసం కాదు, ఏదో పెద్ద పంటే పండించాలన్న నీ ఉద్దేశం నాకు అర్థమయ్యింది. 

నూనూగు మీసాల నీ చిరుగడ్డం నా మెడ వంపుల వొంకలో కొత్త దారులు వెదికింది 
ఇంతక ముందు అక్కడెప్పుడూ ఎవ్వరూ ఏమీ దొరకబుచ్చుకోలేదు. 
రెప్ప పాటు దూరంలో నాలుగు కళ్ళు కలుసుకున్నాయి.. 
నీ చూపులు నా అంతరాంతరాలలోని నాకే తెలియని మార్మిక లోకాల లోకి ద్వారాలు తెరిచాయి 
అదొక మజిలీ మాత్రమే, అసలు గమ్యాలు ఎక్కడో మిగిలే ఉన్నాయి!

అవి నీ చేతి వేళ్లో, లేక అదురూ బెదురూ లేని నీ పెదాలో.., 
నా పెదవులపై అవి మధుర సంగీతాలు పలికించాయి, 
విచిత్రమేంటంటే ఆ సంగీతాన్ని మన చెవులు ఎంత మాత్రమూ వినిపించుకోలేదు. 
అది ముద్దనుకోటానికి కూడా లేదు, రెండు భౌతిక శరీరాల మధ్య ఆ రెండు ప్రాణాలూ వేసుకుంటున్న వంతెనలా ఉంది. 
ఆ కట్టడంలో ఉన్న నైపుణ్యం ఏమిటో, మెలకువలేమిటో.. ఎంత కూపీ లాగినా.. తుది మొదల్లేవో ఏమీ అంతు చిక్కడం లేదు.. 
ఈ అద్భుతం జరగడానికి కాస్త ముందు.. పెదవుల్లో గండు చీమలు కోరికినట్లున్న బాధ మాత్రమే నాకు గుర్తుంది, 
అసంపూర్ణమైన రెండు అర్ధ వృత్తాల్లాంటి మన ప్రాణాలు సంపూర్ణం అవ్వటం తప్ప ఇందులో ఏ గొప్ప రహస్యమూ లేదనుకుంటా!

అలా నా అస్తిత్వ్వనికి చెందిన సమస్తమూ నీకు దాసోహం అయ్యింది.. 
ఇది తెలిసిన మరుక్షణమే నువ్వు నా హృదయ రాజ్యాన్ని నీ సొంతం చేసుకున్నావు. 
ఆ సింహాసనానికి నువ్వే రాజువని నీకు తెలియగానే, సరాసరి రాజధానికే చేరుకున్నావు.. 
అగ్ని పర్వతం హృదయంలోకే లావా వెనుదిరిగి పరుగెట్టినట్లు.. లోయ జాడ తెలిసిన వెంటనే జలపాతం దూకినట్లు.. 
నీ భావనలే కాదు, నీ బాహువులు కూడా నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి 
ప్రేమ నిండిన గుండె బలానికి, ఆ గుండెను మోస్తున్న కండ బలానికీ బందీనయ్యా, నా హృదయంలో నేనే కాందిశీకురాలినయ్యా!

ఇంతలో... 
... ఇంతలో ఉన్నట్లుండి మాయమయ్యావు.. సుదూర ఆకాశంలోని మబ్బుల్లో మబ్బులా కలిసిపోయావు 
నీ చేతులు విసిరేసిన నా శరీరం.. చెల్లా చెదరైన అడవిలా భూమంతా ఆక్రమించింది.. నా ఆక్రందనల్లో నీ పేరు మారుమోగి పోయింది... 
ఆ ప్రతి ధ్వనికి మబ్బుల హృదయం కరిగి.. ఆ కన్నీరు వానలా కురిసింది... 
.. వాన వెలిసిన నీలాకాశం నిర్మలంగా మెరిసింది. 
అప్పుడే స్నానం చేసినట్లున్న సూర్యుని వెలుగులో నీ రూపం వెచ్చని చిరునవ్వులు రువ్వింది.. 
ఆ గోరువెచ్చని స్పర్శతో నేను.. నీకు అత్యంత ఇష్టమైన పొద్దు తిరుగుడు పువ్వైపోయాను!
వెచ్చని కిరణాలు మరింత చొరవగా నా ముఖాన్ని ముద్దాడసాగాయి..
ఆ స్పర్శ.. అచ్చంగా మళ్లీ, నా అందమైన ముఖం మీద నీ ముఖం ఆన్చినట్లు...

... భావాల ప్రచురణలో ఈ భాషల గోడలు, మాటల ఇటుకలూ లేకుంటే... కలలోని మన ప్రతి కలయిక గురించీ కోటి పేజీల కోవెల కట్టుకునేవాళ్లం..!

Wednesday, July 24, 2013

భూభ్రమణం


అన్నం, తోటకూర మెంతి పప్పు, కాకరకాయ వేపుడు.. టమోటా చెట్నీ... బయట ఎండారబోస్తూ సూర్యుడు... 
వాసన చేతి మీద 
రుచి నాలుక మీద 
అనుభూతి నరాల మీద.. 
ఎండ నా మీద! 
జీవితం వానా కాలం మధ్యాహ్నాలుగా 
ఎండా కాలం సాయంత్రాలుగా 
చలికాలం రాత్రుల్లుగా ఉంటే ఎంతో మధురం!
ఈ విషయం తలపుకు రాగానే.. 
కుంపట్లో మొలకలు వేసిన కొత్తిమీర పిలకల సాక్షిగా మనసు పులకలు వేస్తోంది.  

చెంబు నీళ్లు.. గ్లాసు తేనీరు పిడికెడు అన్నం.. చిటికెడు ప్రేమ.., 
శరీరం మనసు లాగా మరీ ఎక్కువ కోరికలు కోరదుగా!
మొన్నొక సారి పాత గురువు గారొకరు కలిస్తే.. 
ఎలా ఉన్నారని అడిగిన పాపానికి అడగకుండానే ఇంకో జీవిత పాఠం నేర్పాడు, మహానుభావుడు!
పాడుబడిన ఊళ్లో, పాత ఇంట్లో కొత్త అన్నం తింటూ కొత్త నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నానన్నాడు... 
నా చేత్తో పెట్టిన కమ్మటి భోజనం -ఆయన కితాబిచ్చారు మరి- తిని... 
వస్తావు పాత ఇంటికి.. ఇక్కడ కొత్త పల్లెరాల్లో పాత భోజనం అలవాటు పాటిస్తున్నావు 
పాతింటికి వచ్చాక పాత గ్లాసుల్లో కొత్త రసాలు తాగుతావు అంటూ ఆశీర్వదించారు!

అది నిజమయ్యేలా ఉందని అనిపిస్తుంది.., సరిగా ఇలాంటప్పుడే..  
ఏ మధ్యాహ్నపు భోజనం వేళో మస్తిష్కం అరల్లోని జ్ఞాపకాల దొంతరలు మతికి వచ్చినప్పుడు..!

ఒక్క గంటలో తాకిన గాలుల అలలు 
నిముషం నాట్యానికే పరిచయమై ప్రాణ నేస్తమైపోయిన నీటి స్నేహం  
ఒక్క పూటలో వెయ్యేళ్ల సూర్యున్ని ఆస్వాదించిన నింపాదితనం.. 
ఒక రేయిలో అనుభవించిన లక్ష పున్నముల వెన్నెలలు 
ఒక్క రోజులో కోటి సంవత్సరాల భూమి స్పర్శ... 
చలిమంటల కాంతి, మెరుపుల కాగడాలు 
ఆకాశంలో చేసిన విహార యాత్రలు, నక్షత్రాల లెక్కలు 
చీకట్లో పెట్టిన పరుగులు, రాళ్ల మీద ఆడిన గీతలాటలు
చెట్ల కొమ్మల ఊయలలు, కోనేట్లో కొట్టిన ఈతలు... 

... వందేళ్లు తక్కువనుకుంటాం గానీ.., భూమ్మీద కూడా కాలంతో పనిలేని స్థలాలున్నాయి!
అవి మనలోనే, మనతోనే ఉంటాయి. మన జీవితంలా మన చుట్టూ భూభ్రమణం చేస్తుంటాయి... ((((((((()))))))))