సిగ్గేస్తోందీ...
మూడు పూటలా అన్నం తినడానికి!
...కాలే కడుపుతో మనుష్యులు కన్న పిల్లలు కొందరు డొక్కలు ముడుచుకు పడుకున్నారని తలచుకుంటే,, సిగ్గేస్తోందీ...
సిగ్గేస్తోందీ...
మేడ మిద్దెల్లో జీవించాలంటే!
నిలువ నీడ లేని బాట పక్కని బ్రతుకులు చూస్తుంటే,, సిగ్గేస్తోందీ...
సిగ్గేస్తోందీ...
రంగుల బట్టలు కట్టుకోవాలంటే!
...మురికి కూపంలో చిరిగిన బ్రతుకుల అతుకులు గుర్తొచ్చీ,, సిగ్గేస్తోందీ...
సిగ్గేస్తోందీ...
ఆరోగ్యంతో హాయిగా జీవించాలంటే!
...అంతుచిక్కని జబ్బులతో ఎన్నో బ్రతుకులు చితుకుతున్నాయని తెలిసీ,, సిగ్గేస్తోందీ...
సిగ్గేస్తోందీ...
ప్రియుని ఊహలు గుండెకు హత్తుకోవాలంటే!
...ఎన్ని నిరుపేద హృదయాలు ఆ సంపద కోసం తపిస్తున్నాయో అన్న ఊహకు,, సిగ్గేస్తోందీ...
సిగ్గేస్తోందీ...
ఆకాశం నా హద్దుగా ఎగరాలంటే!
మురికి సందుల్లోని ఇరుకు ఇళ్లల్లో తోడబుట్టిన మానవ జాతి రెక్కలు విరిగాయన్న విషాదం తెలిసీ,, సిగ్గేస్తోందీ...
సిగ్గేస్తోందీ...
గాంధీ బొమ్మను చూస్తుంటే!
...నలగని కోట్లల్లో, నలిగిన నోట్లల్లో బొమ్మలా మిగిలాడని అనుకుంటే,, సిగ్గేస్తోందీ...
సిగ్గేస్తోందీ...
మనిషిని కన్న అమ్మ కళ్లల్లోకి చూడాలంటే!
...పాలిచ్చిన తనువును పైశాచికంగా బేరమాడుతున్న వింత జంతువుల తంతులు చూస్తే,, సిగ్గేస్తోందీ...
సిగ్గేస్తోందీ...
భూమ్మీది మనుష్యులమని విశ్వ సంకేతాలు పంపాలంటే!
...యుద్ధపు చీరలు నేసే, కాలుష్యపు కోరలు చాచే విధ్వంశపు సంతతిమన్న సత్యం తోచీ,, సిగ్గేస్తోందీ...
No comments:
Post a Comment